
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగళవారం ఉదయం గాల్లో తీవ్ర వాయు ప్రకంపనలకు (టర్బులెన్స్) గురైంది. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు కోల్పోవడంతో అందులో ప్రయాణిస్తున్న కనీసం 15 మంది గాయపడ్డారు. వీరిలో ఒక కేబిన్ సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఫుకెట్ నుంచి ఎఐ-2379 విమానంగా నడిచిన ఎయిర్ ఇండియా ఏ320 విమానం ఉదయం సుమారు 11.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 134 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 11 మంది ప్రయాణికులు, నలుగురు కేబిన్ సిబ్బంది సహా మొత్తం 15 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించారు.
డీజీసీఏ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రయాణ మధ్యలో విమానం సుమారు 300 అడుగుల ఎత్తు ఒక్కసారిగా కోల్పోవడంతో ఒక కేబిన్ సిబ్బంది తీవ్రంగా, మరో కేబిన్ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. కొంతమంది ప్రయాణికులకూ స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ఎయిర్ ఇండియా వెల్లడించిన వివరాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ప్రయాణ సమయంలో కొద్దిసేపు టర్బులెన్స్ కారణంగా విమానం ఎత్తులో తాత్కాలిక మార్పు చోటుచేసుకుందని, అనంతరం విమానం ఢిల్లీలో సురక్షితంగా దిగిందని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా విమానం నుంచి దిగారని పేర్కొంది.
తీవ్ర గాయాలేవీ నమోదు కాలేదని, వైద్య పరీక్షలు అవసరమైన కొద్దిమంది ప్రయాణికులు, సిబ్బందిని ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని, డీజీసీఏ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వెల్లడించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో టర్బులెన్స్ ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు పైలట్లు ముందుగానే ప్రయాణికులను అప్రమత్తం చేయడం సాధారణ ప్రక్రియ. అయితే టర్బులెన్స్ కారణంగా ప్రయాణికులు, కేబిన్ సిబ్బంది గాయపడే ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. గతంలో 2024, మే 21న లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర టర్బులెన్స్‌కు గురికాగా, గుండెపోటు అనుమానంతో ఒక ప్రయాణికుడు మృతి చెందాడు. మరో పలువురు గాయపడ్డారు. అలాగే 2022 మే 1న ముంబయి నుంచి దుర్గాపూర్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం కూడా తీవ్ర టర్బులెన్స్‌ను ఎదుర్కొని, పలువురు ప్రయాణికులు గాయపడిన ఘటన చోటు చేసుకుంది.








