
జింబాబ్వేతో జరిగిన రెండో టి-20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే యువ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మైదానం బయట విమర్శల నుంచి వైభవ్‌ను ఎలా కాపాడుకోవాలో టీం ఇండియా వద్ద స్పష్టమైన ప్లాన్ ఉందని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. నిన్నటి మ్యాచ్ అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ చాలా స్మార్ట్. ఏం చేస్తున్నాడు, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ఉండాలి అన్న విషయం అతడికి స్పష్టంగా తెలుసు. అతడికి బయట మిత్ర బృందంలో ఆట మీది నుంచి దృష్టి మళ్లించే చాలా అంశాలు ఉండొచ్చు. నేను అటువంటి నేపథ్యం నుంచే వచ్చాను.
క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఏ సమయంలో వేటిపై దృష్టి ఉంచాలో తెలియాలి. ఈ విషయంలో నేను వైభవ్‌కు సాయపడతాను. అంతేకాదు.. జట్టులో అభిషేక్, అక్షర్, చాలా మంది ఇతర ఆటగాళ్లు కూడా అతడికి అండగా ఉంటారు. అతడు వీలైనంత క్రికెట్ గురించే ఆలోచించేలా చేస్తాం. సోషల్‌మీడియా, బయట నుంచి వచ్చే విమర్శలు వంటి వాటి ప్రభావానికి లోను కాకుండా తక్కువ స్కోర్ చేసినప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ మారకుండా చూసుకొంటాము. అతడిలాంటి బ్యాటర్ పవర్ ప్లేలోని తొలి ఆరు ఓవర్లు నిలబడి విజృంభిస్తే తేలిగ్గా 90 పరుగుల వరకు రాబట్టవచ్చు. చిన్న వయసులోనే అతడిలా ఆడే క్రీడాకారుడికి ఆట నుంచి దృష్టి మళ్లకుండా చూసుకోవాలి. ఒక సోదరుడి వలే ఆట, ఫిట్‌నెస్, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం వంటి అంశాల్లో సహాయపడతాను’’ అని ఇషాన్ అన్నాడు.











