
మన తెలంగాణ/భద్రాచలం: భద్రాచలంకు సరిహద్దున ఉన్న పోలవరం జిల్లా ఎటపాక మండలం టీపీ వీడు పంచాయతీ పరిధి గొల్లగూడెం గ్రామంలో శనివారం ఉదయం పెను విషాదం చోటు చేసుకున్నది. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గోదావరిలో మునిగి దుర్మరణం పాలవ్వగా, మరో ఆరుగురు వ్యక్తులు బతికి బయట పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఎటపాక మండలం గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన మొత్తం 11 మంది గిరిజనులు టీపీవీడు పంచాయతీ పరిధిలోకి వచ్చే గొల్లగూడెం గ్రామ సమీపంలో గోదావరి నది వద్దకు ఉదయం 9.30 గంటలకు చేపల వేటకు వెళ్లారు. అయితే, నదిలోకి దిగిన వారందరూ నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. వీరిలో ఆరుగురు ఎలాగోలా ప్రాణాలతో బయటపడగా ఊకె లక్ష్మి (37), ఊకె సుశీల (37), బాసిబోయిన బాలరాజు (40), తుర్రం భారతి (40), ఊకె రమేష్ (37)లు గల్లంతయ్యారు. దీంతో ప్రమాద సమాచారం అందుకున్న చింతూరు డీఎస్పీ హేమంత్, ఎటపాక సీఐ కృష్ణ, ఎస్సై అప్పలరాజు, ఇతర పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా, ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











