మన తెలంగాణ/హైదరాబాద్ : విశాఖపట్నం జిల్లా ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గండిగుండం సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపుతప్పి, ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జవగా, అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు వీరంతా కారులో వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా, నలుగురు చనిపోగా.. పల్నాడు జిల్లా నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ (పర్సనల్ అసిస్టెంట్) చంద్రశేఖర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విష మంగా ఉండటంతో విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చంద్ర శేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎంతో శ్రమించి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులు వినుకొండ నియోజకవర్గానికి చెందినవారు. ఈ ఘటనలో పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి భవాని శంకర్ మృతి చెందారు. నరసరావుపేటకు చెందిన డ్రైవర్ శ్రీను చనిపోయినవారిలో ఉన్నాడు. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమా దంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం వల్ల కారు కంట్రోల్ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక డ్రైవర్ నిద్రమత్తు వల్ల జరిగిందా ? అని అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు.