
తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్‌లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పటి నుంచే ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఈ సినిమాలో నాలుగు పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లర్ సూర్య, ఇంకో పిల్లర్ రాధిక , మూడో పిల్లర్ రవీనా టాండన్ , ఇంకో పిల్లర్ మమితా బైజు. ఈ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా అందరి తరపున కృతజ్ఞతలు.‘అని అన్నారు. కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.‘ఈ సినిమాపై ప్రేమను కురిపిస్తూ.. ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకులు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కొన్ని సినిమాలను వసూళ్లతో కొలవలేము. ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే ఈ సినిమా అసలు విజయం దాగుంది’ అని తెలిపారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కు మొదటి రోజుతో పోలిస్తే, రెండో రోజు రెట్టింపు వసూళ్ళు వస్తున్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది. 30 శాతం, 40 శాతం వసూళ్లు పెరగడం నేను విన్నాను. కానీ, వసూ ళ్ళు రెట్టింపు అవ్వడం నా కెరీర్ లో మొదటిసారి చూస్తున్నాను. అందరూ నేను బాగా రాశానని అంటున్నారు. కానీ, సూర్య ఈ సినిమాని భుజాల మీద మోశారు. ఈ వసూళ్ళ ఘనత అంతా ఆయనకే దక్కుతుంది‘ అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర పంపిణీదారులు హాజరై, సినిమా సాధిస్తున్న భారీ వసూళ్లపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నటులు రవీనా టాండన్, సునీల్ రెడ్డి, వైవా హర్ష, ఫైట్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొని చిత్ర విజయం పట్ల తమ ఆనందాన్ని పంచుకున్నారు.











