సొంతూళ్లలోనే ఎన్యూమరేషన్ ఫారాలు

ఓటరు ఫొటో అతికింది, ఫారం నింపి ఇవ్వాలి

ఎవరికైనా చెబితే ఫారాలు నింపి ఇస్తారో ఇవ్వరో..?అనే సందేహం

ఒకసారి స్వగ్రామంలో ఓటు తొలగిస్తే మళ్లీ ఓటు వస్తుందో..లేదో..? అనే ఆందోళన

సొంతూరిలో ఓటు లేకపోతే విలువ ఉండదనే భావన

భారమైనా సొంతూరిలో ఓటును కాపాడుకోవాలనే తపన

అటు రోజువారీ కూలీ నష్టం.. ఇటు ప్రయాణ ఖర్చులు

ఉపాధి పనులు వదులుకుని ప్రయాణాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ క్షేత్రస్థాయిలో వలస కూలీల పాలిట తీవ్ర భారంలా మారుతోంది. ఓటు హక్కును కాపాడుకునేందుకు, బూత్ లెవెల్ ఆఫీసర్ (బిఎల్‌ఒ) ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను తీసెకుని, వాటిని నింపి ఇవ్వడానికి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు విధిలేని పరిస్థితుల్లో సొంతూళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. బతుకుదెరువు కోసం సొంతూళ్లను వదిలి నగరాలకు వలస వెళ్లి అక్కడ ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలు రెండు మూడు రోజులు తమ పనులు వదులుకుని సొంతూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. నగరాల్లో రోజువారీ కూలీ పనులకు చేసుకునే వారికి ఒక్క రోజు పని లేకపోయినా ఆ కుటుంబం గడవడం కష్టమవుతుంది. అలాంటిది, ఎన్యూమరేషన్ ఫారాల కోసం రెండు మూడు రోజులు కేటాయించాల్సి రావడం వల్ల అటు కూలీ నష్టపోవడంతో పాటు, ఇటు బస్సు, ఆటో ఛార్జీల రూపంలో అదనపు భారం పడుతోందని వలసదారులు వాపోతున్నారు.వారికి కూలీ పోవడంతోపాటు ప్రయాణ ఖర్చులు భరించాల్సి రావడంతో వలస జీవుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

ఊరు దాటితే ఓటు గల్లంతేనా..?

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 25 నుంచి బిఎల్‌ఒలు ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. నిబంధనల ప్రకారం ఓటరు నేరుగా ఇంట్లో అందుబాటులో ఉండి, వివరాలు సరిచూసుకుని పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి నుంచి లక్షలాది కుటుంబాలు హైదరాబాద్ నగరంతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉండటం, ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో క్షేత్రస్థాయిలో బిఎల్‌ఒలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివాసం ఉండటం లేదనే నెపంతో ఎక్కడ తమ ఓట్లు తొలగిస్తారో అని ఆందోళనతో వలస కూలీలు అరకొర సంపాదనను ప్రయాణాలకు వెచ్చిస్తూ సొంతూళ్ల బాట పడుతున్నారు.

ఓటర్లు బిఎల్‌ఒల నుంచి ఎన్యుమరేషన్ పత్రాలు తీసుకుని వాటిపై తప్పనిసరిగా ఓటరు ఫొటో అతికింది వివరాలు నింపి సంతకం చేసి తిరిగి బిఎల్‌ఒలు అందజేయాలి. అయితే, ఓటరు కుటుంబ సభ్యులు ఎవరైనా ఎన్యుమరేషన్ పత్రాలు సంతకం చేసే వెసులుబాటును అందరూ పూర్తిస్థాయిలో వినియోగించుకుని పరిస్థితి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులలో కొందరు సొంతూరిలో నివాసంలో ఉంటే వారికి వాట్సాప్, ఈమెయిల్‌లో ఫొటోలు పంపించి ఫారాలు నింపి ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే, కుటుంబ సభ్యులు అందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళితే మాత్రం వారు తప్పనిసరిగా వారి గ్రామాలకు వెళ్లి ఫారాలు నింపి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. సొంతూళ్లలో ఎవరికైనా ఫారాలు నింపి ఇవ్వమని చెబితే ఇస్తారో ఇవ్వరో అనే సందేహంతో ఓటర్లే స్వయంగా వారి గ్రామాలకు వెళ్లి ఫారాలు ఇచ్చేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకసారి స్వగ్రామంలో ఓటు తొలగిస్తే మళ్లీ అక్కడ ఓటు వస్తుందో..లేదో..? అని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఆందోళనకు గురవుతున్నారు. సొంతూరిలో ఓటు లేకపోతే విలువ ఉండదు అని భావిస్తున్న వలస కూలీలు భారమైనా అక్కడే తమ ఓటును కాపాడుకునేందుకు గ్రామాల బాట పడుతున్నారు.

ఆన్‌లైన్‌లో అవకాశం ఉన్నా.. అవగాహన కరువు

ఎన్నికల సంఘం ఓటర్ల సౌకర్యార్థం ఆన్‌లైన్ ద్వారా ఎన్యూమరేషన్ పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల వలస కూలీలకు దీనిపై సరైన అవగాహన లేదు. సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోవడంతో చాలామంది ప్రత్యక్షంగా ఊళ్లకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. అధికారులు స్పందించి వలస ప్రాంతాల్లోనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడమో, లేదా ఫోన్ల ద్వారా వివరాలు సేకరించే ప్రక్రియను మరింత సరళతరం చేయాలని, అప్పుడే వలస జీవులకు ఆర్థిక భారం తప్పుతుందని పలువురు కోరుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలనుకునే వారు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటరు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబరు లేదా ఎపిక్ కార్డు నంబర్‌ను ఉపయోగించి https://voters.eci.gov.in పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.

రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్‌కు ఒటిపి వస్తుంది. దానిని నమోదు చేయటంతో ఫుల్ ఎన్యూమరేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేయాలి. ఒకవేళ ఓటరు కొత్త ప్రాంతానికి మారితే, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించిన తర్వాత వారు తమ చిరునామాను మార్చుకోవచ్చు. ఇందుకోసం, వారు ఫారం -8 ద్వారా ఇఆర్‌ఒకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి, మార్పులను తుది జాబితాలో చేర్చుతారు.