న్యూఢిల్లీ: జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాజ్యసభ బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈనెల 24న పెద్దలసభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభ ఆమోదముద్ర వేసింది. సవరించిన బిల్లు ప్రకారం ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, ఆలపించే సమయంలో ఎవరైనా ఆటంకం కలిగించినా క్రిమినల్ చర్యగా భావించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

వందేమాతరం బిల్లులో భాగంగా ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్-1971’లో సవరణలు చేయాలని కేంద్రం ఇటీవల ప్రతిపాదించింది. జాతీయ గీతమైన ‘జనగణమన’ ప్రస్తుతం ఈ చట్టపరమైన రక్షణ లభిస్తోంది. తాజాగా సవరించిన వందేమాతరం బిల్లుతో ఈ చట్టపరమైన రక్షణ వందేమాతరానికీ వర్తిస్తుంది. వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించడంతో పాటు దోషులకు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు.

వందేమాతర 150వ వార్షికోత్సవం సందర్భంగా బిల్లుకు సవరణలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ గేయాన్ని బకించంద్ర ఛటోపాధ్యాయ రచించగా, ఆ తర్వాత ఆయన నవల ‘ఆనందమఠ్’లో దానిని చేర్చారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో శక్తివంతమైన సింబల్‌గా వందేమాతరం నిలవడంతో దానిని దేశ జాతీయ గేయంగా అధికారికంగా గుర్తించారు.