జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, దానిని అవమానించినా నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026’ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వామపక్షాలతోపాటు పలువురు ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు.దేశ జాతీయ చిహ్నాలను అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’కు ఈ బిల్లు ద్వారా సవరణలు చేయనున్నారు. జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జనగణమన’ను అపవిత్రం చేయడం లేదా అగౌరవపరచడం ఈ చట్టం ప్రకారం నేరం. ఇందుకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.తాజా సవరణ ద్వారా జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా కల్పించాలని కేంద్రం ప్రతిపాదించింది.

‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని ఏడాది పొడవునా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.1950 జనవరి 24న జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో అప్పటి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ‘వందేమాతరం’ ప్రాధాన్యాన్ని వివరించారు. బంకించంద్ర ఛటోపాధ్యాయ రచించిన ఈ గేయం భారత స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని, దీనికి జాతీయ గీతంతో సమానమైన హోదా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ‘వందేమాతరం’ ఆలాపనను అడ్డుకోవడం లేదా అవమానించడాన్ని నిరోధించేందుకు ప్రత్యేకమైన చట్టపరమైన నిబంధన లేదని ప్రతిపాదిత బిల్లు లక్ష్యాలు, కారణాల ప్రకటనలో కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ‘వందేమాతరం’ ఆలాపనను అడ్డుకోవడం లేదా ఆ గేయాన్ని ఆలపిస్తున్న సభకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణించేందుకు ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 3ను సవరించాలని ప్రతిపాదించినట్లు కేంద్రం వెల్లడించింది.