ఢిల్లీ: అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలకమని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని, పూర్తి చేయాలనేది తమ లక్ష్యం అని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలపై సమాలోచన చేశారు. పౌరవిమానశాఖ కేంద్రమంత్రి మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమ్యానని, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులపై అనుమతులు కోరానని, రామ్మోహన్ నాయుడి సహకారం మరువలేనిదని తెలియజేశారు. రాష్ట్రానికి మేలు చేసే పనులు పాడు చేయవద్దని విపక్షాలను కోరుతున్నామని, రామ్మోహన్.. వరంగల్, ఎయిర్ పోర్టులకు సంపూర్ణంగా సహకరిస్తున్నారని, వికసిత్ భారత్ టార్గెట్ లో తాము కూడా భాగస్వాములు కావాలనుకుంటున్నామని, దేశంలో 5శాతం జిడిపిని తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్ పోర్టులు కావాలని, జూన్ 2,2028 నాటికి ఆదిలాబాద్, మామునూరు ఎయిర్ పోర్టులను పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రాల అభివృద్ధిలోనూ విమానాశ్రయాలది కీలక పాత్రని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. వరంగల్ విమానాశ్రయ భూసేకరణకు రేవంత్ రెడ్డి చొరవ చూపించారని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా మామునూరు ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని, మూడు వారాల్లో పనులు మొదలుపెట్టాలని కోరామని అన్నారు. 253 ఎకరాలు ఎయిర్ పోర్టు అథారిటీకి ఇచ్చారని, మూడు, నాలుగు వారాల్లో టెండర్లు జరుగుతాయని అన్నారు. 2028 జూన్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారని, తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నామని, ఆదిలాబాద్ లో రక్షణశాఖ భూముల వ్యవహారం తేలాక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. త్వరగా భూసేకరణ పూర్తి చేసి ఆదిలాబాద్ విమానాశ్రయం పూర్తి చేస్తామని, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు తమ శాఖ నుంచి పూర్తి మద్దతిస్తామని రామ్మోహన్ పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి రద్దీ బాగా పెరుగుతోందని, మరో వంద విమానాశ్రయాలు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు. వరంగల్ ప్రాంత ప్రజలకు అద్భుతమైన విమానాశ్రయం వస్తుందని, కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ విమానాశ్రయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలాగే మిగతా రాష్ట్రాలు కూడా స్పందించాలని, విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని అనేక రాష్ట్రాలు కోరుతున్నాయని, భూసేకరణ సమస్యలు పూర్తి చేసుకుని తమ వద్దకు రావాలని కోరుతున్నామని రామ్మోహన్ అన్నారు.