మనతెలంగాణ/శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రముఖ యూట్యూబర్ రామానందం అలియాస్ నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ విమానంలో శంషాబాద్ వచ్చిన ఆమెపై లుక్ అవుట్ నోటీసు ఉండడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్‌లో ఉంచారు.ఆమెపై ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది నవంబరు 22న కేసు నమోదైంది. లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలపై నందన దంపతులపై ఈ కేసు నమోదైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి మహిళా ఎస్సై, అడ్వకేట్ ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్ నుంచిప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు.