దేశ రాజకీయ ముఖచిత్రంలో ఊహించని సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డిజిటల్ వేదికగా యువత బొద్దింకల జనతా పార్టీ (కాక్రోచ్ జనతా పార్టీ), జాతీయ పరాన్నజీవుల కూటమి (నేషనల్ పారసైటిక్ ఫ్రంట్) పేర్లతో సృష్టించిన రెండు కొత్త శక్తులు సంచలనం కలిగిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత అవినీతికి నిరసనగా భారతీయ జెన్‌జెడ్ సోషల్ మీడియా వినియోగదారులు సృష్టించిన వ్యంగ్య ఆన్‌లైన్ రాజకీయ ఉద్యమాలివి. ఇవి కేవలం మీమ్స్‌కే పరిమితం కాకుండా యువత ఆక్రోశాన్ని ప్రతిబింబించే సామూహిక డిజిటల్ నిరసనగా రూపాంతరం చెందాయి. ఈ రెండింటికీ ఎన్నికల సంఘం గుర్తింపు లేకపోయినా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు చెమటలు పుట్టిస్తున్నాయి. ఇందులో బొద్దింకల జనతా పార్టీ అసాధారణ డిజిటల్ ఉద్యమం వెనుక ఉజ్వలమైన ఆత్మగౌరవ పోరాటం ప్రజ్వలిస్తోంది.

ఇదే నెల (2026 మే)లో ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు తీవ్ర మనస్తాపం కలిగించాయి. నిరుద్యోగ యువత వ్యవస్థపై దాడిచేసే బొద్దింకలని, సమాజాన్ని పట్టిపీడించే పరాన్నజీవులని, సోమరులని, హేళనతో కూడిన ఆ వ్యాఖ్యలకు యువత భగ్గుమంది. దేశవ్యాప్తంగా తిరుగుబాటు జెండా ఎగురవేసే డిజిటల్ రాజకీయ సునామీకి తెరలేపింది. దీంతో సిజెఐ ఆ మరునాడే నాలిక్కర్చుకుని తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారన్నారు. నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిని భ్రష్టుపట్టిస్తున్న కొందరు నకిలీ న్యాయవాదులను ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేసినట్టు వివరణ ఇచ్చారు.

అయినా యువత ఆగ్రహం చల్లారడం లేదు. మమ్మల్ని బొద్దింకలు, పరాన్నజీవులు, సోమరిపోతులంటారా? ఆ పేర్లతోనే కదం తొక్కుతామని యువత డిజిటల్ ఉద్యమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మే 16న కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. బోస్టన్ యూనివర్శిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న, గతంలో ఆప్ సోషల్ మీడియా వాలంటీర్‌గా పనిచేసిన 30 ఏళ్ల యువకుడు అభిజీత్ దీష్కే ఈ వినూత్న పార్టీని స్థాపించారు. ఈ పార్టీ తమ నినాదంగా సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (సోమరి) అని ప్రకటించుకుంది. నిత్యం ఆన్‌లైన్‌లో ఉంటూ సోమరిపోతులుగా ముద్రపడి, ఇటీవల బొద్దింకలు అని పిలవబడ్డ యువత కోసమే ఈ పార్టీ అంటూ వ్యంగ్యంగా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ పార్టీ పెట్టిన కేవలం 48 గంటల్లోనే సొంతంగా వెబ్‌సైట్, పార్టీ గీతాన్ని కూడా విడుదల చేయడం గమనార్హం. మే 20 నాటికి కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్స్ ఖాతాలో 60లక్షల వరకు ఫాలోవర్లు పెరిగారంటే ఉద్యమం ఎంత ఊపులో ఉందో తెలుస్తుంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా, కీర్తి అజాద్ వంటి ప్రముఖ పార్లమెంటేరియన్లు దీనికి గట్టి మద్దతు ఇస్తున్నారు.

ఈ నిరసన ఉద్యమం డిజిటల్ స్క్రీన్లను దాటి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో వందలాది మంది యువ వాలంటీర్లు బొద్దింకల వేషధారణతో కాలుష్యమయమైన యమునా నదిని స్వచ్ఛందంగా శుభ్రం చేస్తూ శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. సుప్రీం, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు రిటైరైన తరువాత వారికి ప్రభుత్వ పదవులు ఇవ్వరాదని, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయాలని, చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని, అక్రమ మీడియా సంస్థల లైసెన్సు రద్దు చేయాలని తదితర ఐదు ప్రధాన డిమాండ్లతో మేనిఫెస్టో విడుదల చేసింది. కాక్రోచ్ జనతా పార్టీకి సమాంతరంగా ఏర్పడిన నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ ప్రభుత్వ వైఫల్యాలను, లోపభూయిష్టమైన వ్యవస్థలను ఎండగట్టడమే తమ ప్రధాన లక్షంగా విప్లవాత్మక అసంబద్ధత అనే సరికొత్త ప్రచార శైలిని అనుసరిస్తోంది. పన్నులు కడుతూ కనీస సదుపాయాలు పొందలేకపోతున్న సాధారణ పౌరులు ఈ వ్యవస్థలో బాధితులుగా బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని డిమాండ్లను తెరపైకి తీసుకు వస్తోంది. నేరచరిత్ర లేని స్వచ్ఛమైన పార్లమెంట్ ఏర్పాటు కావాలని, దేశంలో మెరుగైన శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించడం, సామాన్యులకు నమ్మకమైన ప్రజా రవాణా, విద్యుత్ వంటి వినియోగ సేవలను తక్కువ ధరకు అందించాలని, వీరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ రెండు డిజిటల్ ఉద్యమాలు తమకు మద్దతుగా కొన్ని లక్షల ఫాలోవర్లను చేర్చుకోగలుగుతున్నాయి. ఇది కేవలం నవ్వులాటకో, మీమ్స్ కోసమో పెట్టిన పార్టీ కాదని, కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేస్తోంది. దేశంలో హాట్‌టాపిక్‌గా మారిన నీట్ పేపర్ లీకేజీ అంశంపై కాక్రోచ్ జనతా తీవ్రంగా స్పందించింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.

సిబిఎస్‌ఇ రీచెకింగ్ ఫీజులను రద్దు చేయాలని కోరుతోంది. యువత సమస్యలపై గళం పెంచుతోంది. భారత యువత అత్యంత అవగాహనతో ఉన్నారని, తమపై జరిగే అపహాస్యాన్ని, తమ అసంతృప్తిని హింసాత్మక మార్గాల్లో కాకుండా అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా, వ్యంగ్యంగా ప్రపంచానికి చాటి చెబుతున్నారని, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీష్కే పేర్కొన్నారు. డిజిటల్ సునామీ సృష్టిస్తున్న ఈ యువకులంతా తాము కేవలం సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్లు మాత్రమే కాదని, నిర్మాణాత్మక విమర్శల ద్వారా దేశంలో నిజమైన మార్పును కోరుకునే బాధ్యతాయుతమైన పౌరులమని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా జెన్‌జెడ్ యువత ఆకాంక్షలకు తగ్గట్టు వారి సమస్యలను పరిష్కరించలేకుంటే ఈమీమ్ పాలిటిక్స్ భవిష్యత్‌లో అసలైన ఎన్నికల రాజకీయాలను శాసించినా ఆశ్చర్యపోనక్కరలేదు.