
మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయ పార్టీల జెండాలు, ఎజెండాలతో యువత పోరాటాన్ని మలినం చేయవద్దని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హితవు పలికా రు. నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహి స్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర ధాన్ వెంటనే రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసు లు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నా రు. అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం చేసి తె లంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా విద్యార్థుల ఉద్యమానికి తాము అండగా ఉండాలనుకున్నామని తెలిపారు. ఢిల్లీలో వి ద్యార్థులపై జరిగిన దాష్టికాన్ని అణచివేతను చూస్తే ఎవరి మనసైనా కరగాల్సిందే అని పేర్కొన్నారు. విద్యార్థులు అడిగిన దాంట్లో అన్యాయం ఏమున్నది..? అని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయమని తమ భవిష్యత్తును కాపాడమని విద్యార్థులు అడుగుతున్నారని చెప్పారు.
యువతరం ప్రధాని కుర్చీ అడిగారా.. కేంద్రమంత్రి కుర్చీ అడిగారా..? అని నిలదీశారు. నీట్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం(బిఆర్‌ఎస్‌వి) ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, యువకులు హాజరయ్యారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని నల్లచొక్కా ధరించి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం లేదని, తమకు జరిగిన అన్యాయంపై న్యాయం మాత్రమే కోరుతున్నారని అన్నారు. నీట్ పరీక్షా పత్రం పేపర్ లీక్‌తో పాటు విద్యారంగంలో సంస్కరణ రావాలని సోనం వాంగ్ చుక్ నిరసనకు కూర్చున్నారని అన్నారు. జవాబుదారీతనం, విద్యా విధానంలో సంస్కరణలు చేపట్టాలని కోరుతూ ఆయన నిరసన చేపట్టారని తెలిపారు. ఇడి, సిబిఐలకు భయపడి ఒక్క మీడియాసంస్థ కూడా ఢిల్లీలో నిరసనలను చూపించలేదని, కానీ జెన్ జీ సోషల్ మీడియా ద్వారా దేశం మొత్తాన్ని కదిలించిందని పేర్కొన్నారు.
ఇదే తెలంగాణ గడ్డ నుంచి 50 ఏళ్ల కింద జీనా హైతో మర్నా సికో కదం కదం పర్ లడ్నాసికో అని ఒక యువకుడు పిలుపునిచ్చారని, ఆ స్ఫూర్తితో తెలంగాణ యువత, దేశ యువత గట్టిగా కొట్లాడుతున్నదని అన్నారు. యువత శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. యువతతో ఘర్షణ పడిన నేపాల్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితిని కేంద్రం గుర్తుంచుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత కదం తొక్కుతున్నారని కెటిఆర్ అన్నారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారని, ఆయన జాగ్రత్త పడాలని హెచ్చరించారు. తరం మారుతుంది, స్వరం మారుతుంది అని కేంద్రం తెలుసుకోవాలని సూచించారు. యువత తలచుకుంటే కొద్ది రోజుల క్రితమే నేపాల్‌లో ప్రభుత్వం కుప్పకూలిందని, శ్రీలంకలో దేశం విడిచి వెళ్లే వరకు ఉరికిచ్చి కొట్టారని అన్నారు. పిల్లలు ఉద్యమం చేస్తుంటే దేశ ద్రోహులు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉడుత ఊపులు, ఐటి, సిబిఐ, ఇడికి ఈ జనరేషన్ భయపడదు అని పేర్కొన్నారు. పొట్టు పొట్టు ఆకలితో ఉన్న జెన్ జీ మెట్టు మెట్టు ఎక్కుతారని అన్నారు.
తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా పిల్లలు ఢిల్లీ వెళ్లి అద్భుత పోరాట పటిమ కనబరుస్తోందని తెలిపారు. తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో ఎలాంటి రాజకీయాలు లేవు అని, విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని చూడలేకనే ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రేప్ కేసులలో బిజెపి నాయకుల కొడుకులకు బెయిల్ వస్తుంది కానీ, తమకు న్యాయం ఎందుకు జరగడం లేదని విద్యార్థులు అడుగుతున్నారని అన్నారు. ఎనిమిది మంది బిజెపి ఎంపీల్లో ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారా..? అని ప్రశ్నించారు. మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం అంటారని, ఏ దేశం కోసం, ఏ ధర్మం కోసం అని అడిగారు. ఈ పిల్లలు దేశభక్తులు కాదా..ఈ దేశం వాళ్లు కాదా..హిందువులు కాదా..మరి వాళ్లకు అన్యాయం జరుగుతుంటే మీ కళ్లకు కనిపించడం లేదా..?అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అందుకే వెనక్కి తగ్గకుండా పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదని అక్కడ ఉన్న యువతను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
మోదీపై పోరాడుతుంటే చోటాభాయ్‌కు ఎందుకు కోపం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కొట్లాడేందుకు తాము వస్తుంటే ఇక్కడ చోటాభాయ్‌కు ఎందుకు కోపం అని కెటిఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తాము ధర్నా చేస్తుంటే, దానిని అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్‌ను పంపడం ఎందుకని నిలదీశారు. యూత్ కాంగ్రెస్ వాళ్లు తన కారుకు అడ్డుపడ్డారన్నారు. దిల్లీలో ధర్నా చేస్తున్న పిల్లల్ని కొడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు నోరుమెదపట్లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఇంత జరుగుతుంటే సిఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లి దాక్కున్నారని విమర్శించారు. గతంలో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన చరిత్ర తమదేనని, ఇప్పుడు కూడా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. తమ పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు మొత్తం బిఆర్‌ఎస్ పార్టీ విద్యార్థులకు సంఘీభావంగా వచ్చిందని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి... పిల్లలపై దమనకాండ వెంటనే ఆపాలి..ఢిల్లీలో పోలీసు జులుం నశించాలి..కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి..వి వాంట్ జస్టిస్ అంటూ కెటిఆర్ సహా అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.











