నవంబర్ 17వ తేదీలోగా సిపిఎస్‌ను రద్దు చేయాలి

లేకపోతే సామూహిక సెలవు పెట్టి సామూహిక దీక్షలు చేపడుతాం

ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దును చేర్చినందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం

ఇచ్చిన హామీ ప్రకారం నవంబర్ 17లోగా ప్రకటన చేస్తే మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం

సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ విజ్ఞప్తి

ఎల్‌బి స్టేడియంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను అమల్లోకి తీసుకొస్తామని 2023లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంతో సిపిఎస్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని, ప్రస్తుతం ఇచ్చిన మాట ప్రకారం సిఎం రేవంత్‌రెడ్డి నవంబర్ 17వ తేదీలోగా సిపిఎస్‌ను రద్దు చేస్తే వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు. నవంబర్ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫోస్టోనే ప్రకటించిన రోజనీ, ఆరోజు లోగా రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌పై నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టి ధర్మదీక్షలు చేపడుతామని స్థితప్రజ్ఞహెచ్చరించారు. 2023 ఎన్నికల సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీందర్ సుఖు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా తమ రాష్ట్రంలో ఇప్పటికే సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్‌ను అమల్లోకి తీసుకొచ్చామని దీనివల్ల లక్ష పైచిలుకు ఉద్యోగులు లాభపడ్డారని తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే ఇక్కడ కూడా సిపిఎస్‌ను రద్దు చేస్తారని ఆయన హామీ ఇచ్చారన్నారు.

అనంతరం అప్పటి పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్‌రెడ్డి సైతం వరంగల్ సభలో సిపిఎస్‌ను రద్దు చేస్తామని మాట ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ గుర్తు చేశారు. దీంతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసిసి అగ్ర నాయకులైన రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు సైతం సిపిఎస్ రద్దుపై స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను అమల్లోకి తీసుకురావాలని సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరం లోగా ఓపిఎస్‌ను అమల్లోకి తీసుకురావాల్సిందేనని స్థితప్రజ్ఞ సూచించారు.

లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులతో (తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్) ఆధ్వర్యంలో ఎల్‌బి స్టేడియంలో ‘సిపిఎస్ రద్దు పాత పెన్షన్’ పునరుద్ధరణ బహిరంగ సభను ఆదివారం నిర్వహించారు. జూలై 11వ తేదీన ప్రారంభమైన జన జాగరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆదివారం ఎల్ బిస్టేడియంలో జన జాగరణ సభ నిర్వహించారు. దీనికి లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభలో కల్వల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్, శ్రీనివాస్, పవన్, మల్లికార్జున్, రోషన్, నరేందర్ రావు, సమీన్ కాత్‌వన్, శ్యాం సుందర్, లింగమూర్తి, పలు జిల్లాలకు చెందిన సిపిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

రిటైర్‌మెంట్ అయిన వారికి కనీస వేతనం రూ.4200లు మాత్రమే....

ఈ సందర్భంగా సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఓపిఎస్‌ను రద్దు చేసి 22 ఏళ్లు అయ్యిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 5 వేల మంది సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయ్యారని వారికి కనీసం వేతనం రూ.5 వేలు కూడా రావడం లేదని ఆయన వాపోయారు. రాజయ్య అనే సిపిఎస్ ఉద్యోగి తాను రిటైర్‌మెంట్ అయ్యే నాటికి ఆయన జీతం రూ.91 800లు ఉంటే ఆయన రిటైర్‌మెంట్ అయిన మరుసటి నెల ఆయనకు కనీస వేతనం రూ.4,200లు మాత్రమే వచ్చిందని దీనివల్ల ఉద్యోగి కాలం ఎలా నెట్టుకొస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పాత పెన్షన్ (ఓపిఎస్) అమల్లో ఉంటే రిటైర్‌మెంట్ అయిన వారికి సుమారుగా రూ.10 వేల కనీసం వేతనం వస్తుందని ఇప్పటికే ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల ఆవేదనను అర్ధం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సిపిఎస్ రద్దుతో రాష్ట్రంలోని 2.6 లక్షల మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత

పాత పెన్షన్‌ను అమల్లోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదని ఆయన పేర్కొన్నారు. పాత పెన్షన్‌ను అమల్లోకి తీసుకొస్తే ప్రభుత్వాన్ని జీవితాంతం ఉద్యోగులు గుర్తు పెట్టుకుంటారని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆర్థిక భద్రత, రాబోయే భవిష్యత్ తరాల మనుగడకు సంబంధించిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న న్యాయమైన డిమాండ్‌తో సిపిఎస్ ఉద్యోగులు ఈ సభను ఏర్పాటు చేసుకున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగా కొన్నేళ్లుగా తాము చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఎమ్మెల్యేలు, మంత్రులకు, ప్రతిపక్షాల నాయకులకు వినతిపత్రాలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దుపై స్పష్టమైన హామీ ఇచ్చిందని ఇప్పటికైనా దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, సిపిఎస్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలని స్థితప్రజ్ఞ ప్రభుత్వానికి విన్నవించారు. ఉద్యోగికి పెన్షన్ భద్రత ఇస్తుందని, సిపిఎస్ వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఓపిఎస్‌ను మళ్లీ అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్టు స్థితప్రజ్ఞ తెలిపారు. ఇప్పటికే సిపిఎస్ రద్దును చేసి పలు రాష్ట్రాలు ఓపిఎస్‌ను అమల్లోకి తీసుకొచ్చాయని అందులో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉన్నాయని, ఇక్కడ కూడా మన ప్రభుత్వం పాత పెన్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికే సిపిఎస్ రద్దు గురించి ఎమ్మెల్యేలు, మంత్రులకు, ప్రతిపక్షాల నాయకులకు వినతిపత్రాలు అందించామని ఆయన తెలిపారు. సిపిఎస్ వల్ల ఉద్యోగులు కోట్ల రూపాయలను నష్టపోతున్నారని వాటిని లెక్కల రూపంలో ప్రభుత్వానికి అందించామని ఆయన పేర్కొన్నారు.