
చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం పెరగాలనే వాదన మళ్లీ బలం పుంజుకుంటోంది. లోక్‌సభ, అసెంబ్లీ వంటి ఉన్నత చట్టసభల ప్రాతినిధ్యానికి కనీస వయోపరిమితి 25 యేళ్ల నుంచి 21కి తగ్గించాలనే చర్చను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేవనెత్తారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పరచి, ఆ మేర తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతామనీ ఆయన ప్రకటించారు. ఈ అంశంపై ఇది కొత్త చర్చేం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే! కానీ, 25 యేళ్ల వర్తింపు వైపే ఇప్పటివరకు మొగ్గు కొనసాగుతోంది. ఓటు హక్కు 18 యేళ్లకు లభిస్తున్నపుడు ప్రాతినిధ్యం వయసు 21 యేళ్లకు తగ్గించాలనే డిమాండ్ తప్పేం కాకపోయినా, ‘హేతుబ ద్ధత’ అంశమే వివిధ స్థాయిల్లో తరచూ వివాదాస్పదమవుతోంది. ‘21కి తగ్గించడం మంచిదే, యువత అవకాశాలు మెరుగవుతాయి, పెరుగుతున్న యువజనాభా దామాషాను బట్టి వారికి ప్రాతినిధ్యం లభించాల్సిందే’ అనేది ఒక వాదన. ‘సరికాదు, చట్టాలు చేసే స్థాయి పరిపక్వత 25 యేళ్లు నిండితే కాని రాదు, దాన్ని మార్చకుండా ఉండటమే మంచిద’నే వాదన మరొకటి. తగ్గింపు చిత్తశుద్ధితో చేస్తున్న తాజా ప్రతిపాదనా? లేక జెన్‌జీ ని ఆకట్టుకునే రాజకీయ ఎత్తుగడా? అన్నది నిలకడపై తేలాల్సిందే!
‘నీట్’ ప్రశ్నపత్రాల లీక్, తిరిగి పరీక్షల నిర్వహణ, సర్కారు జవాబుదారీతనం కోరుతూ దేశయువత ఉద్యమించిన దరిమిళా తలెత్తిన పరిణామాలతో యువశక్తి తడాఖా ఏంటో దేశప్రజలకు తెలిసివచ్చింది. ముఖ్యంగా మన రాజకీయ పార్టీలు ఈ పరిణామాల నుంచి గ్రహించిన, గ్రహించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. మన సంప్రదాయ రాజకీయ వ్యవస్థ సాధించలేనిది ఈ దేశపు యువతరం ఉద్యమించి, పట్టుదలతో అనుకున్నది సాధించిన తీరు పలువురిని విస్మయపరిచింది. ఎన్నో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు మింగుడు పడని, లొంగని బిజెపి నాయకత్వం పట్టువీడి, మెట్టుదిగి రావాల్సిన పరిస్థితిని యువశక్తి కల్పించింది. ఆధునిక సాంకేతికత పుణ్యమా అని ‘సోషల్ మీడియా’ మాధ్యమంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిజెపి) ని ఏర్పరచి, యువతరం సంఘటితమైన తీరు అసాధారణం! యువశక్తిని తక్కువ అంచనా వేయకూడదనే మౌలిక అంశాన్ని రాజకీయ పార్టీలు గ్రహించినట్టున్నాయి.
దాని ఫలితమే అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యువశక్తి ప్రాధాన్యత, వారికి చట్టసభల్లో స్థానం కల్పించాల్సిన అవసరాన్ని పెద్ద గొంతుతో నొక్కి చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా యువతరాన్ని ఆకట్టుకునేదే! కొంత మంది ఆలోచనాపరులు కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఇంకొందరికి మాత్రం వయోపరిమితి తగ్గింపు ఆలోచనపై సందేహాలున్నాయి. తొందరపాటు తగదని, చట్టసభలకు యోగ్యమైన కనీస వయసు అనేది ఎన్నో అనుబంధ విషయాలతో ముడివడిన అంశమనేది వారి భావన. ఈ పరస్పర విరుద్ధ భావనలవల్లే చర్చ మళ్లీ తెరపైకి వస్తోంది.
18 యేళ్లకు ఓటు హక్కు ఉన్నపుడు 21 యేళ్లకు ప్రజాప్రతినిధి ఎందుకు కాకూడదని వయోపరిమితి తగ్గింపు కోరేవారి వాదన. చట్టసభకు తమ ప్రతినిధుల్ని ఎన్నుకునే తెలివి ఉన్నవారికి ఎన్నికయి, బాధ్యతలు నిర్వహించే తెలివి, పరిణతి మాత్రం ఉండవా? అనే ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. దేశంలో 35 యేళ్ల లోపు వారి జనాభా 65 శాతం ఉంది. యువతకు అవకాశం కల్పిస్తే జనాభా దామాషాలో కాకపోయినా ఎన్నదగినంత ప్రాతినిధ్యం యువతరానికి దక్కే అవకాశాలున్నాయి. సత్తువ, నూత్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యం, సోషల్ మీడియాపై పట్టు, డిజిటల్ గవర్నెన్స్ వంటివి యువతకు కలిసివచ్చే సానుకూతలు. విధాన నిర్ణాయక సంస్థల్లో యువతరం ఉంటే స్టార్టప్స్, క్లైమెట్ చేంజ్, పాత సమస్యలకు కొత్త దృక్పథం తదితరాలు వారికి తేలికగా ఒంటబడుతాయనే అభిప్రాయం ఉంది.
ఐ.ఎ.ఎస్., ఐపిఎస్ వంటి సివిల్ సర్వీసెస్‌లో, త్రివిధ సాయుధ బలగాల్లో, బహుళజాతి ఐటి కంపెనీల్లో సమర్థంగా పనిచేస్తున్నపుడు అదే వయస్కులు రాజకీయాల్లో మాత్రం రాణించరనే సందేహం దేనికి? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పటితో పోల్చి చూస్తే నేటి యువతలో 21 యేళ్లకే ‘ఐక్యూ’ సగటు స్థాయి పెరిగిందని, వైవిధ్య విషయాలపై లోతైన అవగాహన ఉంటోందని, కనుక చట్టసభలకు రావడంవల్ల నష్టం లేదంటున్నారు. అమెరికాలో ‘హౌజ్’కు ఎన్నికవడానికి 25 సంవత్సరాల వయో పరిమితి ఉండగా, రాష్ట్రాల చట్టసభలకు యోగ్యత 18 సంవత్సరాలు. బ్రిటన్, కెనడా తోపాటు పలు దేశాలు 18 సంవత్సరాలకే ఆ అవకాశం కల్పిస్తున్నాయి. ఓటు హక్కు వయసు ప్రపంచవ్యాప్తంగా సగటున 18 సంవత్సరాలే ఉన్నప్పటికీ చట్టసభలకు ఎన్నికయేందుకు మాత్రం మెజారిటీ దేశాల్లో 21 నుంచి 25 సంవత్సరాలుగా ఉంది. తగ్గించే విషయంలో అక్కడ కూడా చర్చ, మీమాంస ఉంది.
ఓటరు (18), ప్రజాప్రతినిధి (25) మధ్య 7 సంవత్సరాల అంతరం ఉండటంపై అంతర్జాతీయ వేదిక ‘ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపియు’ పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తింది. 25 నుంచి 21 కి తగ్గించాలనే ప్రతిపాదన వేగం పుంజుకుంది. కానీ, నిర్ణయాలు తీసుకోగలిగే పరిణతి 25 యేళ్లకే వస్తుందని, దాన్ని 21కి తగ్గించడం సముచితం కాదనే అభిప్రాయం వైపు మొగ్గు ఎక్కువగా ఉంది. నిజానికి 21 సంవత్సరాలకు యువతీ యువకులు ఇంకా ఉన్నత చదువు కొనసాగిస్తూనో, ఉద్యోగం వేటలోనో, శిక్షణలోనో, ఉద్యోగంలో నిలదొక్కుకుంటూనో, అనుభవం గడిస్తూనో ఉంటారని... ఆ దశలో చట్టసభలకు ఎన్నికవడం సదరు ప్రయాణానికి భంగకరమేకాక చట్టసభలకు అంతగా ఉపయోగకరం కాదనేది వయోపరిమితి తగ్గింపును వ్యతిరేకించేవారి వాదన.
సివిల్ సర్వీసెస్‌కు ఎంపికవడం, చట్టసభల్లో చేరడం ఒకటి కాదని, అక్కడ ఏడాదికి పైగా శిక్షణతో పాటు ఉద్యోగ ఆరంభంలో వివిధ కిందిస్థాయి పనుల్లో అనుభవం గడించేలా ఏర్పాటు ఉంటుందనే అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఆర్థికాంశం కూడా అడ్డొస్తోంది. 21 యేళ్లకు యువతకు రాబడి, ఆర్థిక స్వేచ్ఛ ఉండదని, అసాధారణంగా పెరిగిన ఎన్నికల వ్యయానికి అప్పుడు అభ్యర్థులు పార్టీపైనో, కుటుంబంపైనో ఆధారపడాల్సి వస్తుందనే వివరణ ఉంది. 21 యేళ్లకు తగ్గించడం వల్ల తండ్రి చాటునో, భర్త నీడనో రాజకీయాలు చేసే ‘డమ్మీ అభ్యర్థిత్వా’లను, వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించనట్టవుతుందనే భయసందేహాలున్నాయి. పలు విషయాలపై సమాచారంతో లభించే జ్ఞానం వేరు, అనుభవం ద్వారా గడించే మేధో పరిపక్వత, తెలివితేటలు వేరు, కనుక పరిణతి కలిగిన (కనీసం) పాతికేళ్ల వయసులోనే చట్టసభల పోటీకి అనుమతించాలని ఈ వర్గం వాదిస్తోంది. నెహ్రూ గాంధీ కుటుంబీకుడై కూడా రాహుల్ గాంధీ 34 యేళ్లకు తొలిసారి చట్టసభకు రావడం, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జసిండా ఆర్డెర్న్ (న్యూజీలాండ్) చట్టసభకు 37 యేళ్లకు ఎన్నికై, ఆ దేశ ప్రధాని అవడమైనా పరిణత వయసులోనే అని కొందరు ఉటంకిస్తున్నారు.
యువ ప్రాతినిధ్యం ఇతరత్రా పెరగదా? రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం మెరుగవాలి. మన ఎన్నికల్లో ప్రచార వ్యయాలను నియంత్రించాలి. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొల్లగొట్టే విచ్చలవిడి ధన ప్రవాహాన్నీ, నిర్హేతుక హామీలను నియంత్రించే మలి విడత ఎన్నికల సంస్కరణలు వెంటనే రావాలి. అవేవీ చేపట్టకుండా చట్టసభలకు ప్రాతినిధ్యం వయసును 25 నుంచి 21కి తగ్గించడంవల్ల అదనపు ప్రయోజనం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. యువత రాజకీయాల్లోకి వచ్చేలా, వచ్చి వారిక్కడ క్రియాశీల పాత్ర పోషించేలా రాజకీయ వాతావరణాన్ని సంస్కరించాలి. ప్రపంచంలో 30 యేళ్ల లోపు వారి జనాభా 50 శాతం వరకుంది. కానీ, 30 యేళ్ల లోపు వారి ప్రాతినిధ్యం చట్టసభల్లో (ప్రపంచ సగటు) 2.6 శాతం మాత్రమే! అది కూడా అంతకు రెండేళ్లు ముందరి కన్నా 0.4 శాతం పెరుగటం వల్ల సాధ్యమయిందని ‘యుపిఐ’ నివేదిక చెబుతోంది.
మన దేశంలో మరీ అధ్వానంగా, 30యేళ్ల లోపు వారి ప్రాతినిధ్యం 1% మాత్రమే! ప్రపంచంలోని 25% చట్టసభల్లో 30యేళ్ల లోపు యువత ప్రాతినిధ్యమే లేదు. భారత్‌లోనే తీసుకుంటే, 25 30 సంవత్సరాల మధ్య వయస్కులు చట్టసభల్లోకి ఒక శాతం కూడా వస్తలేనపుడు, 21 24 మధ్య వయస్కులు మాత్రం పరుగెత్తుకొని వస్తారనే గ్యారెంటీ ఏంటి? యువతరం చట్ట సభల్లోకి వచ్చే ప్రోత్సాహకర వాతావరణాన్ని ముందు వృద్ధి చేయాలి. పార్టీల్లో ప్రజాస్వామ్యం పెరిగి, ఎన్నికల్లో సంస్కరణలు జరిగి 25 నుంచి 30, 35, 40 యేళ్ల వయస్కుల ప్రాతినిధ్యం చట్టసభల్లో, మంత్రివర్గాల్లో రమారమి పెరిగినా.. అది యువతరానికి పెద్దపీట లభించినట్టే! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇరవయేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఇటీవల ఆయన మిత్రులు వేడుక చేశారు. కుటుంబ రాజకీయ నేపథ్యం లేకుండా, అంత తక్కువ వ్యవధిలోనే సిఎం పదవి చేపట్టడం రికార్డే! అవకాశాలు కల్పిస్తే తనలాగే యువతరం దూసుకువస్తారని సిఎం భావించి ఉంటారు.
అందుకే, వయోపరిమితి తగ్గింపు విషయంలో పట్టుదలగా ఉన్నారు. కానీ, ఆయనన్నట్టు రాష్ర్ట శాసనసభలో తీర్మాణం సరిపోదు. అదంత తేలికయిన విషయమూ కాదు. రాజ్యాంగ సవరణ జరగాలి, కేంద్రంలోని ప్రభుత్వం సహకరించాలి. రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాకైనా పట్టుబట్టి చేపిస్తాననీ ఆయన పేర్కొన్నారు. ఇటీవలి ఢిల్లీ పరిణామాల వేడిలో జెన్‌జీ ని ఆకట్టుకునే ఎత్తుగడ కాకపోతే, ‘మీ చేతిలో ఉన్న మేరకు యువతకు అవకాశాలు కల్పించం’డి అనే ఒత్తిడి ఆయనపై పెరగొచ్చు. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలో 54 72 మధ్య వయస్కులే మంత్రులుగా ఉన్నారు. విస్తరణలో యువతరానికి (30 యేళ్లలోపు వారికి) అవకాశం కల్పించమనో, పార్టీలో అవకాశాలు పెంచమనో, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇమ్మనో డిమాండ్ పెరగొచ్చు. అందుకాయన స్పందించాల్సి ఉంటుంది. కనీస వయసే కాకుండా గరిష్ట వయో పరిమితలోనూ సంస్కరణలు రావాలి. 65 సంవత్సరాల తర్వాత నాయకులు పదవీ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా గాని, చట్టరీత్యా గాని వైదొలగాలి. సిఎం, పిఎం వంటి కీలక పదవులు ఒకరు రెండు మార్లకు మించి చేపట్టకుండా కట్టడి విధించాలి. ఇటువంటి డిమాండ్లు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. బహుశా అప్పుడు యువత అవకాశాలు పెరుగుతాయని కాబోలు!
- దిలీప్ రెడ్డి ( సమకాలీనం)
(రచయిత పొలిటికల్ అనలిస్ట్,
డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)











