అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బుధవారం మరోసారి భారీగా పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో రూపాయి విలువ 96 రూపాయల 96 పైసల వద్ద ఆల్‌టైమ్ ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి డాలర్‌కు 96 రూపాయల 82 పైసల వద్ద ముగిసింది. గత ముగింపుతో పోలిస్తే 29 పైసలు బలహీనపడింది.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు వినయ్ రాజాని ప్రకారం.. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా డాలర్‌కు సేఫ్‌హేవన్ డిమాండ్ పెరగడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని తెలిపారు.
ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు ధరలు బ్యారెల్‌కు 108 డాలర్లకు పైగా పెరిగాయి. దీంతో దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత పెరుగుతున్నాయి. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పటివరకు పెద్దగా ఉపశమనం కనిపించలేదు.














