వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా జరుపుకోవాలని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రజలకు పిలుపునిచ్చారు. నగరాలు, చెరువులు, నదుల్లో కాలుష్యం పెరగకుండా మట్టి వినాయకుడు, విత్తన గణపతి విగ్రహాలను ఉపయోగించాలని సూచించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు విజయ్ దేవరకొండకు విత్తన గణపతి విగ్రహాన్ని అందించారు. తన నివాసంలో ఈ విగ్రహాన్ని ప్రదర్శించిన విజయ్.. సహజ మట్టితో తయారు చేసిన గణపతులను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు.
విత్తన గణపతి ప్రత్యేకత ఏమిటంటే.. పూజ అనంతరం విగ్రహాన్ని ఇంట్లోనే మట్టిలో నిమజ్జనం చేస్తే.. మట్టి కరిగిపోయి అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ఆ తర్వాత మొక్కను పెంచి, అవసరమైన చోట నాటుకోవచ్చని విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపి.. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు.
సహజ మట్టి, కొబ్బరి పీచు, కోకోపీట్‌తో పాటు వేప, చింత వంటి స్థానిక చెట్ల విత్తనాలను విగ్రహంలో పొందుపరుస్తున్నట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలిపింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారయ్యే విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్న నేపథ్యంలో.. మట్టి, విత్తన గణపతులను ఎంచుకోవాలని ప్రజలను కోరింది.
2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. తెలంగాణ హరితహారం స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి.. వాటిని మూడు సంవత్సరాలు సంరక్షించి.. మరో ముగ్గురిని మొక్కలు నాటేందుకు ప్రోత్సహించాలి అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ప్రచారం చేస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి జరగనున్న నేపథ్యంలో.. ఇళ్లు, అపార్ట్‌మెంట్ సంఘాలు, ఆలయాలు, గణేష్ మండపాల నిర్వాహకులు పర్యావరణహిత విగ్రహాలను ఎంచుకోవాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సూచించింది.









