అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అలెన్ నగరంలో ఉన్న రాధా కృష్ణ టెంపుల్ ఆఫ్ డల్లాస్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జూలై 1 నుంచి 5, 2026 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఐదు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవంలో విశ్వక్షేన పూజ, కలశయాత్ర, అధివాస హోమాలు, మహాపూజలు, కుంకుమార్చన, పుష్పార్చన, శాంతి కళ్యాణం తదితర విశిష్ట వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి.
జూలై 4న ప్రధాన ఘట్టమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనుండగా, అనంతరం భక్తులకు తొలి దర్శనం, హారతి, అర్చన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహోత్సవం చివరి రోజు సహస్ర స్వర్ణ పుష్పార్చన, సత్సంగం, మహా అన్నకూట్, శ్రీనివాస ఉంజల్ మహోత్సవం నిర్వహించనున్నారు.
ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక వేడుకలకు భక్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. దర్శనం, సేవా కార్యక్రమాలు, అన్నదానం, వాలంటీర్ సేవల్లో పాల్గొనే అవకాశం కూడా భక్తులకు కల్పిస్తున్నారు.














