డల్లాస్‌లోని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. టీపాడ్ ఆధ్వర్యంలో జూన్ 13న శనివారం ఉదయం 7:00 గంటల నుంచి 8:30 గంటల వరకు “అడాప్ట్-ఎ-హైవే” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
త్రైమాసిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీపాడ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, యువతతో పాటు పలువురు కమ్యూనిటీ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రెస్టన్ రోడ్డును పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కలిసి పనిచేసి పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతల పట్ల తమ నిబద్ధతను చాటారు.
ఈ సందర్భంగా టీపాడ్ ప్రతినిధులు మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ సంరక్షణ, కమ్యూనిటీ సేవల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. “ఒక మైలు దూరం నుంచి మార్పు ప్రారంభమవుతుంది” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు.
వాలంటీర్లకు అల్పాహారం అందించి సహకరించిన ద్వారకా కర్రీ పాయింట్‌కు టీపాడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. స్థానిక వ్యాపార సంస్థలు కూడా కమ్యూనిటీ సేవలో భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొంది.
గతంలో కూడా పలు సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన టీపాడ్, భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి వాలంటీర్‌కు టీపాడ్ బృందం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.















