ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలు. ఇది 1970 ఫిబ్రవరి 2న, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లా కొన్ని ప్రాంతాల నుండి ఆవిర్భవించింది. తరువాత 1972లో, జిల్లాలోని వినోదరాయునిపాలెం గ్రామంలో పుట్టిన ఆంధ్ర నాయకుడైన టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధం ప్రకాశం జిల్లాగా నామకరణం చేసారు. 2022 ఏప్రిల్ 4 న కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గుంటూరు జిల్లానుండి చేరిన భాగం, బాపట్ల జిల్లాలో, నెల్లూరు నుండి చేరిన కొంత భాగం తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపబడింది.
భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ, సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. పూర్వం ఈ జిల్లాలో భాగంగా ఉన్న మార్కాపురం ప్రాంతం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశం జిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. Map






