అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ఉపయోగించి ఆన్‌లైన్ ప్రిడిక్షన్ మార్కెట్‌లో బెట్టింగ్ చేసిన మాజీ వైట్ హౌస్ టెలీప్రాంప్టర్ ఆపరేటర్‌పై అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

మాజీ వైట్ హౌస్ సిబ్బంది గాబ్రియెల్ పెరెజ్కు మొత్తం $172,539 చెల్లించాలని అమెరికా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) ఆదేశించింది. ట్రంప్ ప్రసంగాల్లో ఏ పదాలు, పదబంధాలు వినిపించనున్నాయనే దానిపై ఆయన Kalshi ప్లాట్‌ఫామ్‌లో బెట్లు వేసినట్లు CFTC తెలిపింది.

ఈ సెటిల్‌మెంట్ ప్రకారం పెరెజ్ సంపాదించిన $107,539.02 లాభాలను తిరిగి చెల్లించాలి. అదనంగా $65,000 సివిల్ పెనాల్టీ విధించారు. దీంతో మొత్తం మొత్తం $172,539.02 అవుతుంది. అలాగే మూడేళ్ల పాటు CFTC పరిధిలోని సంస్థల్లో ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించారు.

అసలు ఎలా బెట్టింగ్ చేశాడు?

పెరెజ్ Kalshi అనే ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాడు. ఇందులో ‘మెన్షన్ మార్కెట్స్’ పేరుతో ప్రముఖ వ్యక్తులు ప్రసంగాల్లో నిర్దిష్ట పదాలు లేదా పదబంధాలను ఉపయోగిస్తారా లేదా అనే అంశంపై ట్రేడింగ్ చేయవచ్చు.

వైట్ హౌస్‌లో టెలీప్రాంప్టర్ ఆపరేటర్‌గా పనిచేసిన పెరెజ్‌కు ట్రంప్ ప్రసంగాల స్క్రిప్ట్‌లు ముందుగానే అందుబాటులో ఉండేవి. ఈ సమాచారాన్ని ఉపయోగించి 2025 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య బెట్లు వేసి $107,500కుపైగా లాభం పొందినట్లు CFTC తెలిపింది.

అంటే సాధారణ ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమైన సమాచారాన్ని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించారని అమెరికా రెగ్యులేటర్ ఆరోపించింది.

సహకారంతో జరిమానా తగ్గింపు

CFTC విధించిన $65,000 సివిల్ పెనాల్టీ సాధారణంగా ఉండే స్థాయి కంటే తక్కువగా ఉందని సంస్థ తెలిపింది.

దర్యాప్తులో పెరెజ్ సంపూర్ణ సహకారం అందించినందుకు జరిమానాలో గణనీయమైన తగ్గింపు ఇచ్చినట్లు CFTC వెల్లడించింది. సెటిల్‌మెంట్‌ను అంగీకరించినప్పటికీ.. రెగ్యులేటర్ చేసిన ఆరోపణలను పెరెజ్ అంగీకరించినట్లు దీని అర్థం కాదు.

వైట్ హౌస్‌లోనే ముందుగా చర్యలు

ఈ వ్యవహారం జూలైలో వెలుగులోకి వచ్చింది. ట్రంప్ ప్రసంగాలపై ప్రిడిక్షన్ మార్కెట్ బెట్టింగ్‌ల ద్వారా పెరెజ్ భారీగా లాభపడినట్లు వార్తలు రావడంతో దర్యాప్తు ప్రారంభమైంది.

తర్వాత ఆయనను వేతనం లేని అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌పై ఉంచారు. ప్రస్తుతం ఆయన ఫెడరల్ ప్రభుత్వంలో పనిచేయడం లేదు. ఆయన రాజీనామా చేశారా లేదా తొలగించబడ్డారా అనే విషయాన్ని వైట్ హౌస్ స్పష్టంగా వెల్లడించలేదు.

ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగం కాని ప్రభుత్వ సమాచారాన్ని ఉపయోగించి ప్రిడిక్షన్ మార్కెట్లలో బెట్లు వేయకూడదని వైట్ హౌస్ గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది.

Kalshi వ్యవస్థే అనుమానాస్పద ట్రేడింగ్‌ను గుర్తించింది

పెరెజ్ ఖాతాలో సాధారణంగా కనిపించని ట్రేడింగ్ కార్యకలాపాలను Kalshi నిఘా వ్యవస్థలు గుర్తించాయి. అనంతరం సంస్థ ఈ వ్యవహారాన్ని CFTC దృష్టికి తీసుకెళ్లింది.

ఈ ఘటనతో ఎన్నికలు, క్రీడలు వంటి అంశాలకే పరిమితమైన ప్రిడిక్షన్ మార్కెట్లు ఇప్పుడు ప్రసంగాలు, ఆర్థిక పరిణామాలు వంటి అంశాలపైనా విస్తరిస్తుండటంతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయా? అనే చర్చ మళ్లీ మొదలైంది.