నేపాల్‌లో కనీవినీ ఎరుగని వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తులో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఆపన్నహస్తం అందిస్తున్న భారత్‌పై నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే ప్రశంసలు కురిపించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘అత్యంత ఉదారమైన వ్యక్తి’గా అభివర్ణించారు. వరదలతో అతలాకుతలమైన నేపాల్ పునర్నిర్మాణానికి భారత్ ఉదారంగా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని న్యూఢిల్లీ సూచించిందని తెలిపారు.

ఇప్పటికే భారత్ 57.6 టన్నుల సహాయ సామగ్రిని నేపాల్‌కు పంపించింది. వైద్య సిబ్బంది, సొరంగ మార్గాల్లో సహాయక చర్యలు చేపట్టే నిపుణులతో కూడిన 11 మంది సభ్యుల భారత బృందం కూడా నేపాల్‌కు చేరుకుంది.

ప్రస్తుతం రక్షణ చర్యలే తొలి ప్రాధాన్యత అని వాగ్లే తెలిపారు. ఇప్పటివరకు 1,930 మందిని విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. ఆ తర్వాత తాత్కాలిక నివాసాలు, పునరుద్ధరణ చర్యలు చేపట్టి.. చివరగా భారీ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు.

2015 భూకంపం సమయంలోనూ భారత్ అందించిన సహాయాన్ని గుర్తుచేసిన వాగ్లే.. ఇప్పుడు కూడా భారత్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు.