నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, విధ్వంసకర ఫ్లాష్ ఫ్లడ్స్ మధ్య ఓ అద్భుత ఘటన చోటుచేసుకుంది. 10 రోజులుగా మట్టి, శిథిలాల మధ్య చిక్కుకుపోయిన 60 ఏళ్ల మహిళను రక్షణ సిబ్బంది సజీవంగా బయటకు తీశారు.
నువాకోట్ జిల్లా బిదుర్ పట్టణంలో నాలుగు అంతస్తుల ఇల్లు వరదల ధాటికి మట్టి, బురద, శిథిలాలతో కూరుకుపోయింది. అదే ఇంటి పై అంతస్తులో చండికా శ్రేష్ఠ చిక్కుకుపోయారు.
రోజులు గడిచినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో.. సహాయక బృందాలు మట్టి, బురదను తొలగిస్తూ తీవ్రంగా గాలించాయి. చివరకు ఓ కిటికీ దగ్గర ఆమె కనిపించడంతో.. తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందం ఆమెను బయటకు తీసుకొచ్చింది.
అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న చండికా.. రెస్క్యూ సిబ్బంది దుప్పటి, జాకెట్‌తో కప్పిన తర్వాత నెమ్మదిగా స్పృహలోకి వచ్చారు. అనంతరం హెలికాప్టర్‌లో ట్రిశూలిలోని నేపాలీ ఆర్మీ మైథిలీ బ్యారక్స్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.10 రోజుల మృత్యుపోరాటం.. చివరకు ప్రాణాలతో బయటపడిన చండికా కథ ఇప్పుడు నేపాల్‌లో సంచలనంగా మారింది!












