విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు కీలక మార్పు చోటుచేసుకోనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల బోర్డింగ్‌ పాస్‌పై ఇమ్మిగ్రేషన్‌ స్టాంపింగ్‌ విధానం నిలిచిపోనుంది. దీంతో విమానాశ్రయంలో ప్రయాణికులకు మరో అదనపు ప్రక్రియ తగ్గనుంది.

ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ సమయంలో బోర్డింగ్‌ పాస్‌ను చూపించాల్సి ఉండేది. అధికారులు దానిపై స్టాంప్‌ వేసేవారు. అయితే ఇకపై బోర్డింగ్‌ పాస్‌పై ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఎలాంటి స్టాంప్‌ వేయరు.

కొత్త విధానంలో ప్రయాణికులు మొబైల్‌లోని ఈ-బోర్డింగ్‌ పాస్‌ను లేదా ప్రింటెడ్‌ బోర్డింగ్‌ పాస్‌ను ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్‌లో చూపించవచ్చు. డిజిటల్‌ బోర్డింగ్‌ పాస్‌ ఉపయోగించే వారు కేవలం స్టాంప్‌ కోసం ప్రింటెడ్‌ కాపీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

ఈ మార్పును బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ తీసుకొచ్చింది. ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంటే.. సెప్టెంబర్‌ 1 నుంచి విదేశీ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్‌ దగ్గర ఒక స్టెప్‌ తగ్గినట్టే! బోర్డింగ్‌ పాస్‌పై స్టాంప్‌ కోసం ఇక ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.