జపాన్‌లోని నాగోయా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. కేవలం ఒక గంటలోనే 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జపాన్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి వర్షపు హెచ్చరికను జారీ చేసింది.

మరోవైపు 2026 ఆసియా క్రీడలకు నాగోయా ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ క్రీడలకు మరో 10 రోజులే ఉన్న సమయంలో వరదలు కలకలం రేపాయి.

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే నాగోయాకు చేరుకున్న సుమారు 400 మంది అథ్లెట్లు, సిబ్బందిని తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని నాగోయా మేయర్ ఇచిరో హిరోసావా తెలిపారు.

క్రీడా వేదికల్లో కొన్ని చోట్ల పైకప్పుల నుంచి నీరు లీకైనప్పటికీ పెద్దగా నష్టం జరగలేదని, ఆసియా క్రీడలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

వరదలతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. బస్సులు, సబ్‌వే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సుమారు 3,500 మంది ప్రజలు అత్యవసర షెల్టర్లకు తరలివెళ్లారు. దాదాపు 200 వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

ఈ ఆసియా క్రీడల్లో 45 దేశాలు, ప్రాంతాల నుంచి 11 వేలకు పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. మొత్తం అథ్లెట్లు, అధికారులు కలిపి సుమారు 17 వేల మంది హాజరుకానున్నారు.

ఇక భారత్ 503 మంది సభ్యులతో కూడిన బృందాన్ని బరిలోకి దించనుంది. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించిన భారత్.. నాగోయాలోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమైనా.. ఆసియా క్రీడలకు ఎలాంటి ఇబ్బంది లేదని జపాన్ అధికారులు స్పష్టం చేశారు.