ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమాలకు హాజరవుతుండగా.. జర్మనీకి చెందిన WELT పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.
టెహ్రాన్‌లోని బెహెష్త్-ఎ-జహ్రా స్మశానవాటికలో దాదాపు 3 వేల సమాధులను ముందుగానే సిద్ధం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. భారీ జనసందోహం, తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా తొక్కిసలాట జరిగితే 1,500 నుంచి 3,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఓ రహస్య లేఖలో అంచనా వేసినట్లు వెల్లడించింది.
అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా విపత్తు నిర్వహణ బృందాలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాయని, అవసరమైతే మృతులు, గల్లంతైన వారి వివరాల కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా సిద్ధం చేసినట్లు తెలిపింది.
ఈ ఏర్పాట్ల వెనుక 2020లో ఖాసెమ్ సులేమానీ అంత్యక్రియల్లో జరిగిన తొక్కిసలాట ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఆ ఘటనలో కనీసం 100 మంది మరణించగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
అయితే, 3 వేల సమాధుల సిద్ధం, రహస్య లేఖ వివరాలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సమాచారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.











