అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర కోర్టు మెటాపై కీలక తీర్పు వెలువరించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించాయని, ప్రజా ప్రయోజనాలకు ఆటంకం కలిగించాయని కోర్టు అభిప్రాయపడింది.

ఈ కేసును 2023లో న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ దాఖలు చేశారు. పిల్లలను ఆన్‌లైన్ దోపిడీ, హానికర కంటెంట్ నుంచి రక్షించడంలో మెటా విఫలమైందని ఆయన ఆరోపించారు.

తాజా తీర్పు ప్రకారం, మెటా 567 మిలియన్ అమెరికన్ డాలర్లు ప్రత్యేక నిధికి చెల్లించాలి. అంతకుముందు ఇదే కేసులో జ్యూరీ విధించిన 375 మిలియన్ డాలర్ల సివిల్ జరిమానాతో కలిపి, మెటాపై మొత్తం ఆర్థిక భారం 942 మిలియన్ డాలర్లకు చేరింది.

కోర్టు ఆదేశాల ప్రకారం, ఐదేళ్లపాటు టీనేజ్ మానసిక ఆరోగ్య నిధిని ఏర్పాటు చేయాలి. ఈ నిధిని చికిత్స, అవగాహన కార్యక్రమాలు, నివారణ చర్యల కోసం వినియోగించాల్సి ఉంటుంది.

అలాగే పిల్లల భద్రతను మెరుగుపరిచేందుకు పలు కీలక మార్పులు చేయాలని కోర్టు సూచించింది. అందులో మైనర్లకు వచ్చే పుష్ నోటిఫికేషన్లపై నియంత్రణ, వయస్సు ధృవీకరణ వ్యవస్థను బలోపేతం చేయడం, AI చాట్‌బాట్‌లకు అదనపు భద్రతా చర్యలు, ఆన్‌లైన్‌లో చిన్నారులను లక్ష్యంగా చేసుకునే నేరగాళ్ల నుంచి రక్షణ కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి.

అయితే ఈ తీర్పుతో తాము ఏకీభవించడం లేదని మెటా ప్రకటించింది. చిన్నారుల భద్రత కోసం ఇప్పటికే అనేక భద్రతా ఫీచర్లు అమలు చేస్తున్నామని, ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని సంస్థ వెల్లడించింది.

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ తీర్పు భవిష్యత్తులో సోషల్ మీడియా సంస్థలపై దాఖలయ్యే ఇలాంటి కేసులకు కీలక మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.