న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగంపై మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి 2-K నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు జనరేటివ్ AI టూల్స్‌ను ఉపయోగించకుండా ఏడాది పాటు నిషేధం విధించారు. ఈ నిర్ణయం దాదాపు 6 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని మమ్దానీ తెలిపారు. కొత్త టెక్నాలజీని పూర్తిగా వ్యతిరేకించడం లేదని, అయితే అది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

ఈ పాలసీ ప్రకారం చిన్న తరగతుల విద్యార్థులకు AI టూల్స్‌తో పాటు AI చాట్‌బాట్ల వినియోగాన్ని కూడా నిషేధించనున్నారు. అదే సమయంలో AI ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నిపుణులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.

అయితే హైస్కూల్ విద్యార్థులకు మాత్రం AIపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పాఠాలను ప్రవేశపెట్టనున్నారు. ఏడాదిలో రెండుసార్లు AI లిటరసీ, టెక్నాలజీలో ఉండే పక్షపాతం, నైతికత, క్రిటికల్ థింకింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు బోధించనున్నారు. ఎంపిక చేసిన కొన్ని హైస్కూల్ తరగతుల్లో పర్యవేక్షణతో AI పైలట్ ప్రోగ్రామ్‌లకు కూడా అనుమతి ఇవ్వనున్నారు.

మరోవైపు ఉపాధ్యాయులు లెసన్ ప్లానింగ్, అడ్మినిస్ట్రేటివ్ పనుల కోసం నగర భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా AIని ఉపయోగించుకోవచ్చు.

AIతో పాటు స్క్రీన్ టైమ్‌పై కూడా కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చారు. చిన్న తరగతుల విద్యార్థుల వ్యక్తిగత డివైస్ వినియోగంపై పరిమితులు విధించనుండగా, 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రోజుకు గరిష్ఠంగా 30 నిమిషాలు, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 45 నిమిషాల స్క్రీన్ టైమ్‌ను సిఫారసు చేశారు.

తరగతి గదుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో మానవ సంబంధాలను పెంపొందించుకోవడం, సమస్యలను స్వయంగా పరిష్కరించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ముఖ్యమని మమ్దానీ పేర్కొన్నారు.

పిల్లలపై AI, స్క్రీన్ ఆధారిత విద్య ప్రభావంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. AI ఆధారిత విద్యా కార్యక్రమాలు విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన కంటే టెక్నాలజీపై ఆధారపడే పరిస్థితిని పెంచుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి.

టెక్నాలజీని పూర్తిగా తిరస్కరించడం కాదు.. విద్యార్థులకు అది ఎప్పుడు, ఎలా ఉపయోగపడాలన్న దానిపై నియంత్రణ అవసరమన్నదే ఈ కొత్త పాలసీ ఉద్దేశమని న్యూయార్క్ అధికారులు చెబుతున్నారు.