ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో ఆయన పర్యటించనున్నారు.మోదీ రాక నేపథ్యంలో.. ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్ నగరం భారత జాతీయ జెండా రంగులతో మెరిసిపోతోంది. నగరంలోని ప్రముఖ హిల్టన్ హోటల్ భవనంపై భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
రాత్రివేళ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో మెరిసిన హిల్టన్ హోటల్.. చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. భవనం మొత్తం భారత జాతీయ పతాకాన్ని తలపించేలా ప్రత్యేక లైటింగ్‌తో అలంకరించారు.
ప్రధాని మోదీ పర్యటనకు ముందు తాష్కెంట్‌లో కనిపించిన ఈ ప్రత్యేక దృశ్యం.. భారత్‌పై ఉజ్బెకిస్థాన్‌కు ఉన్న స్నేహభావాన్ని చాటిచెబుతోంది. అంతేకాదు.. ఇరు దేశాల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు ఇది ప్రతీకగా నిలుస్తోంది.
మోదీ పర్యటనలో భాగంగా.. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై నేతలు చర్చించే అవకాశం ఉంది.
ఆ తర్వాత కిర్గిస్థాన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ.. ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
మొత్తంగా.. మోదీ పర్యటనకు ముందు తాష్కెంట్‌లో వెలుగులు విరజిమ్మిన భారత జాతీయ జెండా.. భారత్-ఉజ్బెకిస్థాన్ స్నేహబంధానికి ప్రత్యేక ప్రతీకగా నిలిచింది.












