దేశవ్యాప్తంగా పైపులైన్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం ద్వారా మరిన్ని ఇళ్లకు శుభ్రమైన, సురక్షితమైన, అందుబాటు ధరలో వంట గ్యాస్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం దేశంలో సుమారు 1.74 కోట్ల గృహ PNG కనెక్షన్లు ఉన్నాయి. కొత్త పథకం కింద.. పనిచేయని లేదా బిల్లింగ్ లేని కనెక్షన్లను తిరిగి యాక్టివ్ చేయడంతో పాటు కొత్త ప్రాంతాల్లో కనెక్షన్లు పెంచే CGD సంస్థలకు ప్రోత్సాహకాలు అందించనున్నారు.

నిర్దేశిత లక్ష్యానికి మించి ప్రతి కొత్తగా బిల్లు అయ్యే PNG కనెక్షన్‌కు అదనంగా 200 SCM దేశీయ APM గ్యాస్ కేటాయించనున్నారు. ఈ పథకం రెండు ఆరు నెలల దశల్లో అమలు కానుంది. ఖరీదైన LNG స్థానంలో తక్కువ ధర గల దేశీయ గ్యాస్ అందడంతో సంస్థల ఖర్చులు తగ్గనున్నాయి.

దీంతో PNG కనెక్షన్లపై పెట్టుబడుల రికవరీ సమయం దాదాపు 10 ఏళ్ల నుంచి మూడు సంవత్సరాలకు తగ్గే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.

ఇక PNG ద్వారా సిలిండర్ల బుకింగ్, నిల్వ, మార్పిడి అవసరం ఉండదు. మీటర్ ఆధారంగా వినియోగానికి అనుగుణంగా బిల్లు చెల్లించవచ్చు. పైగా ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే ఇంధనం కావడంతో పర్యావరణానికి, ఇంటి లోపలి గాలి నాణ్యతకు కూడా ప్రయోజనం కలుగుతుంది.

దేశవ్యాప్తంగా PNG విస్తరణలో భాగంగా National PNG Drive 2.0, సింగిల్ డిజిటల్ పోర్టల్, రెగ్యులేటరీ క్లియరెన్స్‌ల సరళీకరణ వంటి చర్యలను కూడా ప్రభుత్వం చేపడుతోంది.