పీఎం కేర్స్ ఫండ్‌ నిధులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫండ్‌ మొత్తం విలువ రూ.8,452.07 కోట్లకు చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెట్టుబడి వ్యూహాల్లో చేసిన మార్పుల కారణంగానే నిధుల విలువ గణనీయంగా పెరిగినట్లు ఆడిట్‌ నివేదికలు పేర్కొన్నాయి.

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ.7,173.03 కోట్లుగా ఉన్న నిధులు.. ఏడాది ముగిసే నాటికి భారీగా పెరిగాయి. గతంలో పీఎం కేర్స్‌ ఫండ్‌లోని నిధులు ఎక్కువగా సేవింగ్స్‌ ఖాతాల్లో ఉండగా.. ప్రస్తుతం వాటిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మళ్లించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మొత్తం నిధుల్లో రూ.6,641 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉండగా.. రూ.605.41 కోట్లు సేవింగ్స్‌ ఖాతాల్లో ఉన్నాయి. ఎఫ్‌డీలపై గత ఏడాది రూ.469.38 కోట్ల వడ్డీ లభించగా.. సేవింగ్స్‌ ఖాతాల ద్వారా రూ.5.77 కోట్ల వడ్డీ మాత్రమే వచ్చినట్లు సమాచారం.

ఇక స్వదేశీ విరాళాల రూపంలో రూ.479.04 కోట్లు, విదేశీ విరాళాలుగా రూ.92.83 లక్షలు అందాయి. వివిధ ఏజెన్సీల నుంచి మరో రూ.324.66 కోట్ల రిఫండ్‌లు ఫండ్‌కు చేరినట్లు వివరాలు వెల్లడించాయి.