మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరిశిక్ష విధానాన్ని రద్దు చేసి, తక్కువ నొప్పి కలిగించే ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్, షూటింగ్, ఎలక్ట్రిక్ షాక్ లేదా గ్యాస్ చాంబర్ వంటి పద్ధతులను అమలు చేయాలని పిటిషనర్ కోరారు.
న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే, ప్రస్తుత ఉరిశిక్ష విధానంపై సమగ్ర సమీక్ష చేపట్టేందుకు కేంద్రానికి ఈ తీర్పు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఖైదీకి తక్కువ నొప్పి కలిగిస్తూ అతని గౌరవాన్ని కాపాడే మెరుగైన ప్రత్యామ్నాయ పద్ధతి ఏదైనా ఉందా అన్నది పరిశీలించవచ్చని పేర్కొంది.
2017లో సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వచ్చింది. 2023లోనూ సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ జరిపి, ఉరి విధానం సముచితమైనదేనా, తక్కువ నొప్పి కలిగించేదేనా అనే విషయాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుపై ఆలోచించింది. అయితే, మరణశిక్షను ఏ విధానంలో అమలు చేయాలన్న విషయంలో చట్టసభలను ఆదేశించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.









