భారత-భూటాన్ అంతరిక్ష సహకార కార్యక్రమంలో భాగంగా, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) హైదరాబాద్‌లో జూన్ 9 నుంచి 12 వరకు నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

అటవీ అగ్నిప్రమాదాల గుర్తింపు, కాలిపోయిన ప్రాంతాల మ్యాపింగ్ అంశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో భూటాన్‌కు చెందిన 11 మంది అధికారులు పాల్గొన్నారు. ఉపగ్రహ డేటా ఆధారంగా అటవీ అగ్నిప్రమాదాల గుర్తింపు, నష్టం అంచనా, అగ్నిప్రమాదాల నిర్వహణ వ్యవస్థలపై ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు కూడా ప్రత్యేక ఉపన్యాసాలు నిర్వహించారు.

శిక్షణలో భాగంగా భూటాన్ అధికారులు షాద్‌నగర్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ కేంద్రాన్ని సందర్శించి, భారత ఉపగ్రహ డేటా స్వీకరణ, ప్రాసెసింగ్ మరియు అత్యవసర నిర్వహణ వ్యవస్థలను పరిశీలించారు. ఈ కార్యక్రమం ద్వారా భూటాన్‌లో అటవీ అగ్నిప్రమాదాల పర్యవేక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి.