బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 11 రాత్రి ఐదుగురు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి, మహిళ భర్తను గదిలో బంధించి, ఆమెను బయటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. ప్రతిఘటించగా బ్లేడ్‌తో ఛాతీ, తొడలపై గాయపరిచినట్లు తెలిపింది.

చికిత్స అనంతరం కూడా తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెకు మళ్లీ పరీక్షలు నిర్వహించగా, శరీరంలో నుంచి ఒక బుల్లెట్, రాయి ముక్క, చెక్క ముక్కలను వైద్యులు తొలగించినట్లు సమాచారం. మూడు నెలల క్రితం కూడా తనపై దాడి జరిగిందని, అప్పటి ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించింది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.