గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఓ 18 అడుగుల లోతైన బావి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఐదు రోజులుగా ఎలాంటి భూకంపం లేకపోయినా, ఆ బావిలోని నీరు నిరంతరం అలలు, తరంగాలతో కదులుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.
అయితే, ఈ ఘటనకు భూకంపంతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రాథమిక పరిశీలనల ప్రకారం, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు వేగంగా నిండడం, రాళ్లలోని పగుళ్ల ద్వారా చిక్కుకున్న గాలి బయటకు రావడం వల్లే నీటిలో నిరంతర అలలు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై శాస్త్రీయ అధ్యయనం కోసం గాంధీనగర్ నుంచి నిపుణుల బృందాన్ని ప్రభుత్వం పంపింది. పూర్తి నివేదిక అనంతరం అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.









