మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో పూర్వా జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తమ్సా.. అంటే టోన్స్ నదిపై ఉన్న ఈ జలపాతం.. సెమరియా టౌన్ సమీపంలో ఉంటుంది. దాదాపు 230 అడుగుల ఎత్తు నుంచి జాలువారే పూర్వా జలపాతం.. వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతంలోకి భారీగా నీరు చేరడంతో.. ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎత్తైన కొండల నుంచి తెల్లటి నీటి ధారలు వేగంగా కిందకు దూకుతుండటంతో.. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. జలపాతం అందాలను చూసేందుకు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. వర్షాకాలంలో పూర్వా జలపాతం దృశ్యాలు.. ప్రకృతి అందాలకు అద్దం పడుతున్నాయి.