మాజీ మంత్రి, BRS సీనియర్ నేత హరీష్ రావును అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించింది.
ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మహాసభల నిర్వహణ, కార్యక్రమాల రూపకల్పన, ప్రవాస తెలుగు వారి భాగస్వామ్యంపై హరీష్ రావుకు వివరించారు. అలాగే అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి పరిస్థితులు, వారి సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, పదేళ్ల BRS పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల సహకారం ఎంతో కీలకమైందని అన్నారు.
అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్‌ఆర్‌ఐలు అమెరికాలో ఉండి కూడా ఉద్యమానికి విశేష మద్దతు అందించారని, ప్రజాభిప్రాయాన్ని దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పడంలో వారి పాత్ర ప్రశంసనీయమని గుర్తు చేశారు.
హరీష్ రావును కలిసిన వారిలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ఇండియా కోఆర్డినేటర్ వేణు సంకినేని, ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.
ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాలన్న ఆహ్వానంపై హరీష్ రావు సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు.














