ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో 2026 పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. తెలుగు క్రీడాభిమానులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక క్రీడా మహోత్సవం జూలై 26, 2026న టెక్సాస్‌లోని ప్లానో నగరంలో జరగనుంది.
పురుషులు, మహిళలు మరియు మిక్స్‌డ్ జట్లకు ఓపెన్‌గా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో జనరల్ మరియు ప్రో విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలకు ప్లానోలోని డిల్ డింకర్స్ పికిల్‌బాల్ వేదిక కానుంది.
రెక్రియేషనల్, ఇంటర్మీడియట్ స్థాయి ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా జనరల్ కేటగిరీని ఏర్పాటు చేయగా, అనుభవజ్ఞులు మరియు పోటీ స్థాయి క్రీడాకారుల కోసం ప్రో కేటగిరీని నిర్వహించనున్నారు. టోర్నమెంట్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, ట్రోఫీలు, అవార్డులు, నెట్‌వర్కింగ్ అవకాశాలు, కమ్యూనిటీ ఫన్ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
పాల్గొనే క్రీడాకారులకు మధ్యాహ్న భోజనం సౌకర్యంతో పాటు టోర్నమెంట్ అనంతరం డిన్నర్, రిఫ్రెష్‌మెంట్స్‌తో ఆఫ్టర్ పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు సమాజంలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టాంటెక్స్ ప్రతినిధులు వెల్లడించారు.
1986 నుంచి ఉత్తర టెక్సాస్ తెలుగు సమాజానికి సేవలందిస్తున్న టాంటెక్స్ సంస్థ తన 40 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ టోర్నమెంట్‌ను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.















