తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (TANTEX), టెక్సాస్ ఇండో-అమెరికన్ ఫిజిషియన్స్ సొసైటీ (TIPS) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సుఖీభవ ఉచిత ఆరోగ్య శిబిరానికి కమ్యూనిటీ సభ్యుల నుంచి విశేష స్పందన లభించింది.

ఫ్రిస్కోలోని Rejoice Lutheran Churchలో సెప్టెంబర్ 12న ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొని, ప్రజలకు ఉచిత వైద్య సలహాలు, ఆరోగ్య అవగాహనతో పాటు అవసరమైన వైద్య సూచనలు అందించారు.

ఈ శిబిరంలో ఇంటర్నల్ మెడిసిన్, ఫ్యామిలీ ప్రాక్టీస్, కార్డియాలజీ, న్యూట్రిషన్, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, రుమటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, స్లీప్ మెడిసిన్ తదితర విభాగాలకు చెందిన వైద్య నిపుణులు సేవలందించారు.

కార్యక్రమానికి ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్ హాజరై ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. TANTEX, TIPS సంయుక్తంగా నిర్వహించిన ఈ కమ్యూనిటీ సేవా కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం సేవలందిస్తున్న నిర్వాహక బృందం, వైద్యులు, వాలంటీర్లను మేయర్ ప్రశంసించారు.

ఈ సందర్భంగా TANTEX అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి వైద్య నిపుణుల సలహాలను అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని తెలిపారు. ఉచిత ఆరోగ్య శిబిరానికి కమ్యూనిటీ నుంచి లభించిన స్పందన ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమయం కేటాయించి సేవలందించిన వైద్యులు, సహకరించిన వాలంటీర్లు, నిర్వాహక బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లు, వైద్యులు, వాలంటీర్లు, మీడియా భాగస్వాములకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.