అమెరికా తెలుగు సంఘం (ATA) నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ATA కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్‌కు ప్రముఖులను ఆహ్వానిస్తూ, సంఘ సేవా కార్యక్రమాలను వివరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ATA నాయకులు కలిసి అధికారికంగా ఆహ్వానం అందజేశారు. కన్వెన్షన్‌కు హాజరుకావాల్సిందిగా కోరగా, జగన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

అంతేకాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి రాజకీయ, సినీ, కళా రంగ ప్రముఖులు ఈ మహాసభలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా హాజరు సాధ్యం కాకపోయినా, వైసీపీ తరఫున ప్రతినిధులను పంపేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించిన జగన్, ATA మహాసభలకు సంపూర్ణ సహకారం అందించాలని వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ కార్యదర్శి సాంబశివరెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.

ATA ప్రతినిధులు జయంత్ చల్ల (ప్రెసిడెంట్), భువనేశ్ బుజాల (పూర్వ అధ్యక్షులు), శరత్ వేముల, శ్రీకాంత్ గుడిపాటి తదితరులు జగన్‌ను కలిసి ఈ ఆహ్వానాన్ని అందజేశారు.