అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహాసభలు 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరగనున్నాయి.
"Let's Celebrate Our Telugu Heritage Together" (మన తెలుగు వారసత్వాన్ని కలిసి జరుపుకుందాం) అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య వేదికలు, వ్యాపార సదస్సులు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, మహిళా సాధికారత చర్చలు, ఆరోగ్య అవగాహన సెషన్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు వంటి అనేక విశేషాలు చోటు చేసుకోనున్నాయి.
మహాసభల నిర్వహణలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌కు పెద్ద సంఖ్యలో ATA ప్రతినిధులు, వాలంటీర్లు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వహణ, అతిథుల ఆహ్వానం, నమోదు ప్రక్రియ, వసతి, రవాణా, భద్రత, వాలంటీర్ సమన్వయం తదితర అంశాలపై చర్చించి, విజయవంతమైన నిర్వహణకు అవసరమైన కార్యాచరణపై సమాలోచనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ATA నాయకత్వం మాట్లాడుతూ, ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది తెలుగు కుటుంబాలు ఈ మహాసభలకు హాజరవుతారని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాషా వైభవాన్ని భావితరాలకు చేరవేసే గొప్ప వేదికగా ఈ కన్వెన్షన్ నిలుస్తుందని తెలిపారు. ప్రతి తెలుగు కుటుంబం ఈ మహాసభల్లో భాగస్వామ్యం కావాలని వారు ఆహ్వానించారు.
తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ 19వ ATA మహాసభలు ఉత్తర అమెరికాలోని తెలుగు సమాజానికి మరో చిరస్మరణీయ వేడుకగా నిలవనున్నాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.











