సెంట్రల్ ఫ్లోరిడా ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (CFICA) ఆధ్వర్యంలో భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆగస్టు 15న ఫ్లోరిడాలోని ఓవియెడో నగరంలోని హ్యాగర్టీ హై స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రదర్శనలు, వైభవమైన పరేడ్‌తో పాటు భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు, నృత్య బృందాలకు నిర్వాహకులు ఆహ్వానం పలికారు.
సాయంత్రం 6:00 గంటలకు పరేడ్, అనంతరం 6:30 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భారతీయ వారసత్వం, సంస్కృతి, దేశభక్తిని అమెరికా నేలపై ప్రతిష్ఠాత్మకంగా చాటిచెప్పే ఈ వేడుకలకు భారతీయ అమెరికన్ సమాజం పెద్ద ఎత్తున హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి ఫ్లయర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు CFICA వెల్లడించింది.











