అమెరికాలోని డాలస్‌లో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో భారతీయ ఎన్నారైలు 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.
ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ సంయుక్త సహకారంతో ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు ప్రవాస భారతీయులు, కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇర్వింగ్ సిటీ మేయర్ అల్ జపాంటా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా ఎన్నడ్ ఎడిటర్ శ్రీ ఎన్. నాగేశ్వర్ రావు, ప్రముఖ కవి, తెలుగు ఫిల్మ్ లిరిసిస్ట్ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మాజీ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు, సామాజిక సేవకుడు శ్రీ వాజ్మాజు సత్యమూర్తి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర సముపార్జన కోసం సర్వస్వం త్యాగం చేసి అసువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహానేతల కృషిని ఎంత కొనియాడినా తక్కువేనని అన్నారు. వారి త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్ర లభించిందని గుర్తు చేశారు.
భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ ఐక్యత, దేశభక్తి సందేశాలను ప్రముఖులు పంచుకున్నారు. భారతీయ సంస్కృతి, దేశభక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు.















