అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో కన్వెన్షన్ మహాసభలు-2026 ఘనంగా కొనసాగుతున్నాయి. జూన్ 19, 20 తేదీల్లో గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న ఈ రెండు రోజుల మహాసభలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

కన్వెన్షన్ రెండో రోజు కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రాచలం నుంచి విచ్చేసిన వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర వేడుకను తిలకించేందుకు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.

కల్యాణోత్సవ వేదిక వద్ద భక్తి వాతావరణం నెలకొనగా, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. విదేశీ గడ్డపై భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించడం పట్ల ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కన్వెన్షన్‌లో వినోద కార్యక్రమాలతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు పెద్దపీట వేస్తున్నామని మాటా నాయకులు తెలిపారు. తెలుగు వారసత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా సంప్రదాయబద్ధంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవంతో పాటు, అమెరికా చరిత్రలోనే తొలిసారిగా అత్యంత వైభవంగా ‘శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం’ నిర్వహిస్తున్నట్లు మాటా కార్యవర్గం వెల్లడించింది. ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది ప్రవాసులు ఆసక్తిగా తరలివచ్చారు.

ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను ఒకే వేదికపై ఆవిష్కరిస్తున్న మాటా కన్వెన్షన్-2026, అమెరికాలోని తెలుగు సమాజానికి మరపురాని అనుభూతిని అందిస్తోంది. విదేశీ నేలపై తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటిచెబుతున్న ఈ మహాసభలు ప్రవాస భారతీయుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి.