డల్లాస్‌లో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) కార్యకలాపాలు మరింత వేగం పుంజుకోనున్నాయి. జూలై 12న నిర్వహించిన డల్లాస్ చాప్టర్ సమావేశంలో నాట్స్ నాయకత్వం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడంతో పాటు, 2027లో జరగనున్న ప్రతిష్టాత్మక 9వ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణపై కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
మూడు గంటలకు పైగా సాగిన ఈ సమావేశానికి నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో నాట్స్ మహాసభలకు కన్వీనర్ గా ప్రేమ్ కలిదిండి, డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లుగా కిరణ్ నారె, పావనిలను నియమించారు. అనుభవం, యువశక్తి కలయికతో ఏర్పడిన కొత్త జట్టు సంస్థను మరింత బలోపేతం చేస్తుందనే ఆశాభావాన్ని నాయకత్వం వ్యక్తం చేసింది.
సమావేశంలో పాల్గొన్న నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ, చైర్మన్ కిషోర్ కంచర్ల నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశానికి నాట్స్ జాతీయ నాయకులు ప్రేమ్ కలిదిండి, అజయ్ గోవాడ, విజయ్ శేఖర్ అన్నె, భాను లంక, కిషోర్ నారె, రత్నాకర్ శెట్టిపల్లి, శ్రావణ్ నిడిగంటి, ధనుంజయ నూతి తదితరులు హాజరై భవిష్యత్ కార్యాచరణపై తమ సూచనలు చేశారు.
రానున్న రోజుల్లో యువత, మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం, సేవా కార్యక్రమాలను విస్తరించడం, అలాగే మే 2027లో డల్లాస్‌లో జరిగే 9వ అమెరికా తెలుగు సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికలు అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, కన్వీనర్ ప్రేమ్ కలిదిండి మాట్లాడుతూ, మహాసభల విజయానికి పెద్ద సంఖ్యలో వాలంటీర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజ ఐక్యతను ప్రతిబింబించే ఈ మహోత్సవాన్ని అందరి సహకారంతో చిరస్మరణీయంగా నిర్వహిద్దామని వారు పేర్కొన్నారు.











