అమెరికాలోని నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 18, 19 తేదీల్లో జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌లో వైద్యుల కోసం ప్రత్యేకంగా కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో తాజా పరిణామాలు తెలుసుకోవడం, ప్రముఖ నిపుణులతో అనుభవాలు పంచుకోవడం, అలాగే AMA PRA Category 1 Credits పొందే అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పిస్తోంది.

ఈ CME కార్యక్రమానికి భారత వైద్య రంగంలోని దిగ్గజాలు హాజరవుతున్నారు. ఏఐజీ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డా. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననుండగా, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. గురవా రెడ్డి ప్రత్యేక అతిథిగా ప్రసంగించనున్నారు.

అలాగే డా. సంతోష్ రెడ్డి దేవరపల్లి, డా. దీపక్ గారిపల్లి, డా. నందిని సుంకిరెడ్డి, డా. లలిత సి. మేడేపల్లి, డా. సురేష్ రెడ్డి, డా. రఘువీర్ కూర, డా. వేణుమాధవ్ రెడ్డి కోట్ల తదితర ప్రముఖ వైద్య నిపుణులు వివిధ వైద్య అంశాలపై ప్రసంగించనున్నారు. గుండె జబ్బులు, వృద్ధాప్య వైద్యం, క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించే పద్ధతులు, వైద్య రంగంలో వ్యవస్థాపకత (Medical Entrepreneurship) వంటి పలు కీలక అంశాలపై సెషన్లు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం క్లోజ్డ్-డోర్ CME ఈవెంట్ కావడంతో ముందస్తు నమోదు తప్పనిసరి. CME క్రెడిట్స్ పొందాలనుకునే వైద్యులు తమ NPI నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలు, నమోదు కోసం టీటీఏ కన్వెన్షన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు సూచించారు. అమెరికాలోని తెలుగు వైద్యులకు ఈ CME కార్యక్రమం జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు ప్రపంచ స్థాయి వైద్య నిపుణులతో నెట్‌వర్కింగ్‌కు అరుదైన అవకాశంగా నిలవనుంది.

టీటీఏ మెగా కన్వెన్షన్–2026ను అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కన్వెన్షన్ కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి నాయకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. టీటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కౌన్సిల్, వివిధ బోర్డులు, కమిటీల సభ్యులు సమిష్టిగా పనిచేస్తూ మహాసభల విజయానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.