శాన్‌ఫ్రాన్సిస్కోలోని చారిత్రక గదర్ మెమోరియల్ హాల్‌లో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి బే ఏరియా భారతీయులు, ప్రవాస భారతీయ సంఘాల నాయకులు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

1913లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గదర్ పార్టీ స్థాపించిన చారిత్రక నేపథ్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రత్యేక స్థానం ఉందని శ్రీకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలోని పలు అంశాలను ఆయన చదివి వినిపించారు.

అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు స్థానిక యువత, కళాకారులు నిర్వహించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారతీయుల కోసం కాన్సులేట్ అందిస్తున్న అత్యవసర సేవలను కూడా శ్రీకర్ రెడ్డి వివరించారు. వారాంతాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు అత్యవసర వీసాలు, అదే రోజు ట్రావెల్ సర్టిఫికెట్ల వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే భారతీయుల అత్యవసర పరిస్థితుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ పనిచేస్తోందని వెల్లడించారు.