అమెరికాలోని శాన్‌జోస్ డౌన్‌టౌన్‌లో ఆగస్టు 15న స్వదేశ్ 2026 వేడుకలు ఘనంగా జరిగాయి. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు 25 వేల మందికి పైగా హాజరయ్యారు.
స్వదేశ్ 2026లో భాగంగా నిర్వహించిన ఇండియా డే పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 80కి పైగా ఫ్లోట్లు, 50కి పైగా ఇండియన్-అమెరికన్ సంస్థలు పరేడ్‌లో పాల్గొన్నాయి. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించారు. 80 అడుగుల భారత్-అమెరికా జెండా వాక్, తిరంగా వాక్‌తో పాటు సంగీత, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
100 మందికి పైగా చిన్నారులు శాస్త్రీయ, సినీ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కుటుంబాల కోసం ఆర్ట్, చెస్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి, శాన్‌జోస్ మేయర్ మ్యాట్ మహాన్, అమెరికా ప్రతినిధి సామ్ లికార్డో, శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జెఫ్ రోసెన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 40 మందికి పైగా ప్రజాప్రతినిధులు వేడుకలకు హాజరైనట్లు AIA తెలిపింది.
అనంతరం డే అండ్ నైట్ మేళా నిర్వహించగా.. భారతీయ వంటకాలు, షాపింగ్, కుటుంబ వినోద కార్యక్రమాలు సందడి చేశాయి. చివరగా ‘విజయ్ భారత్’ పేరుతో వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలతో వేడుకలు ముగిశాయి.
ఇక సెప్టెంబర్ 19న శాన్‌రామన్‌లోని బిషప్ రాంచ్‌లో ‘గణపతి బప్పా మోరియా’, అక్టోబర్ 17న ప్లెజంటన్‌లోని అలమెడా కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో ‘దసరా దీపావళి ధమాకా’ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు AIA ప్రకటించింది.















