తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్న సిలికానాంధ్ర తన 25వ సిల్వర్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జూలై 31, ఆగస్టు 1, 2026 తేదీల్లో అమెరికాలోని కాలిఫోర్నియా ఓక్‌లాండ్ అరేనా వేదికగా రెండు రోజుల పాటు ఈ మహోత్సవం జరగనుంది.
ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా 'కుంభ హారతి'తో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించే ప్రయత్నం చేపట్టనున్నారు. ఇందులో 108 మంది నర్తకులు, 108 కలశాలతో అద్భుత ప్రదర్శన ఇవ్వనున్నారు. తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.
అదేవిధంగా సంగీతామృతవర్షిణి, లయామృతవర్షిణి, కూచిపూడి నాట్యామృతవర్షిణి, లలితగీతామృతవర్షిణి వంటి సంగీత, నృత్య కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. అలాగే శతక శంఖారావం, వందే భారతం, దక్ష యజ్ఞం, జానపద జాతర వంటి సాంస్కృతిక ప్రదర్శనలు తెలుగు సాహిత్య, చారిత్రక, జానపద వైభవాన్ని ప్రతిబింబించనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు తెలుగు సంస్కృతికి మరో మైలురాయిగా నిలవనున్నాయి.














