అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అలెన్‌లో ఉన్న CUTX Event Center వేదికగా ‘స్వర్ణ యాత్ర – రాగసాగరం: మ్యూజిక్ ఫర్ మెడిటేషన్’ కార్యక్రమం ఆగస్టు 1, 2026న ఘనంగా జరిగింది. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమానికి ముందు నిర్వహించిన స్వాగత సభ భక్తి శ్రద్ధలతో ఆకట్టుకుంది. భక్తులు జెండాలు చేతబూని, పూజ్య శ్రీ స్వామీజీ రచించిన సంప్రదాయ భజనలను ఆలపిస్తూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. భజనలతో ఆ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ధ్యానం, సంగీతం, ఆధ్యాత్మికతను మేళవించిన రాగసాగరం కార్యక్రమంలో స్వామీజీ సంగీతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మధురమైన రాగాలు, భజనలు, ధ్యాన సంగీతంతో భక్తులు ఆధ్యాత్మిక పరవశాన్ని అనుభవించారు.
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అమెరికా ఆధ్యాత్మిక పర్యటనలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణ యాత్ర USA 2026’ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికాలో స్వామీజీ ఆధ్యాత్మిక సేవా ప్రయాణానికి ఐదు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా భక్తులు ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.















