అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) నిర్వహించిన TTA Mega Convention 2026 ఘన విజయాన్ని సాధించింది. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో జూలై 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ మెగా కన్వెన్షన్‌కు 31,000 మందికి పైగా హాజరైనట్లు TTA వెల్లడించింది. అమెరికాలోని తెలుగు సంఘాల చరిత్రలో ఈ వేడుక ఓ కీలక మైలురాయిగా నిలిచిందని తెలిపింది.
TTA అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో నిర్వహించిన ఈ మెగా కన్వెన్షన్‌లో అమెరికా నలుమూలల నుంచి తెలుగు కుటుంబాలు, TTA నాయకులు, సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, కళాకారులు, ప్రముఖ అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వినోదం, సామాజిక కార్యక్రమాలతో షార్లెట్ నగరం సందడిగా మారింది.
కన్వెన్షన్ విజయవంతం కావడంలో TTA నాయకత్వం, సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, కళాకారులు, అతిథులు, అలాగే మొత్తం తెలుగు సమాజం అందించిన సహకారం ఎంతో కీలకమని అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది తెలిపారు.
31 వేల మందికి పైగా హాజరైన ఈ మెగా కన్వెన్షన్ తెలుగు సమాజం ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని మరోసారి చాటిచెప్పిందని TTA పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మధుర జ్ఞాపకాలు సృష్టించామని, ఈ విజయాన్ని ఎన్నో సంవత్సరాల పాటు గుర్తుండిపోయేలా అందరూ కలిసి చరిత్ర సృష్టించారని తెలిపింది.
ఈ సందర్భంగా TTA అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, TTA నాయకత్వం కన్వెన్షన్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “అందరం కలిసి చరిత్ర సృష్టించాం.. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి” అంటూ తెలుగు సమాజానికి ధన్యవాదాలు తెలిపారు.











